సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫెడరేషన్‌కు, నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీని వల్ల ఫెడరేషన్ చేపట్టిన షూటింగ్‌ల బంద్ 13వ రోజుకు చేరింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై చిరంజీవితో నిర్మాత సి.కళ్యాణ్ ఆదివారం సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం, ‘నేనెప్పుడూ ఫిల్మ్‌ఛాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమాకి సంబంధించి నిర్మాతే కీలకం. నావంతుగా కార్మికులతోనూ మాట్లాడతాను’ అని చిరంజీవి అన్నారని సి.కళ్యాణ్ చెప్పారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్టు చెప్పారు. సోమవారం లోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సి.కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మీడియాతో సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ‘ఓ కుటుంబంలా పని చేయటం చిత్ర పరిశ్రమలో అలవాటైంది. కార్మికశాఖ పేర్కొన్న వేతనాల కన్నా ఎక్కువగా ఇస్తున్నాం. ఆ శాఖ నిబంధనల ప్రకారం భోజనం పెట్టాల్సిన పనిలేదు. కానీ ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు, టిఫన్లు, టీ, కాఫీలు ఏర్పాటు చేస్తున్నాం. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఎప్పుడూ ఐక్యత ఉండదు. ఈ ఏడాది 300 సినిమాలు రూపొందితే, అందులో 60 మాత్రమే పెద్దవి. మిగిలిన 240 సినిమాలు చిన్న నిర్మాతలవే. పరిశ్రమలో ఎప్పుడు కొత్తనీరు వస్తూనే ఉంటుంది. అందుకే కృష్ణనగర్ కార్మికుల ఉపాధితో సస్యశ్యామలంగా ఉంది. అయితే ఇలాంటి వేతనాల పెంపు వల్ల ఆ కొత్త నీరు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకట్డ పడితే, అదే కృష్ణనగర్ ఆకలితో అలమటిస్తుంది’ అని చెప్పారు.
ఫెడరేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ..
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ రాసింది. నాలుగు షరతులు, పర్సంటేజీ విధానాన్ని దానిలో వివరించింది. అలాగే, సినిమాకు సంబంధించిన 24 సంఘాల నాయకులతో ఫిల్మ్ ఫెడరేషన్ సోమవారం సమావేశం కానుంది. దీంతోపాటు ఛాంబర్ నిర్ణయాలపైనా చర్చించనుంది.
ఫిల్మ్ ఛాంబర్ షరతులు..
1) ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌ను 12 రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలి.
2) రెండో ఆదివారం, కార్మికశాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుంది.
3) 2022 జులైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఫైటర్స్, డ్యాన్సర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయటం లేదు. అది తప్పనిసరిగా చేయాలి.
4) అదే ఒప్పందంలో జనరల్ కండీషన్స్ క్లాజ్ 1 ప్రకారం.. నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తన సినిమా కోసం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుంది.
షరతులు అంగీకరిస్తే రోజుకు రూ.2 వేలు, అంతకన్నా తక్కువ సంపాదించే కార్మికులకు వేతనాలను వెంటనే10 శాతం, తదుపరి ఏడాది నుంచి అదనంగా 5 శాతం, ఆ తర్వాత సంవత్సరం నుంచి మరో 5 శాతం పెంచేందుకు నిర్మాతలు ప్రతిపాదించారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపు సంపాదించే కార్మికులకు వరుసగా మూడేళ్ళపాటు 5 శాతం వేతన పెంపును నిర్ణయించారు. తక్కువ బడ్జెట్ చిత్రాల విషయంలో ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయి. పెంపు వర్తించదు అని లేఖలో ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.
పరిష్కారం కోసం రంగంలోకి దిగిన చిరంజీవి
- Advertisement -
- Advertisement -