నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల సహాయ అధికారి చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా సాగిందని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19 వార్డులకు గాను మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీలో మొత్తం 25,801 మంది ఓటర్లు ఉండగా, అందులో 12,838 మంది పురుషులు, 12,963 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.ఎన్నికల అధికారులు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని ప్రకటించారు. ఉదయం 9 గంటలకు 3,074 ఓట్లు పోలై 11.91 శాతం నమోదైంది. ఉదయం 11 గంటలకు 8,734 ఓట్లు పోలై 33.85 శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు 15,720 ఓట్లు పోలై 60.93 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 20,470 ఓట్లు పోలై 79.28 శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు మొత్తం 23,713 ఓట్లు పోలై 91.91 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి వెంకటరామిరెడ్డి తెలిపారు.14వ వార్డు పోలింగ్ స్టేషన్ 28లో మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీశారు.
20వ వార్డు పోలింగ్ స్టేషన్ 39 వద్ద ముస్లిం మహిళలు గంటకు పైగా క్యూలో నిలబడి ఓటు వేసిన పరిస్థితి కనిపించింది.బీసీ కాలనీ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థులను పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించలేదని ఆరోపిస్తూ పార్టీ నాయకులు పోలీసులతో స్వల్ప వాగ్వాదానికి దిగారు.అయితే పరిస్థితిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు.వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సిబ్బంది ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.వీల్‌చైర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వేయించేలా సహకరించారు.బంగారిగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భారీగా బారులు తీశారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు సీరియల్ నంబర్లతో స్లిప్పులు ఇచ్చి, వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ వీరాబాయి పర్యవేక్షణలో, చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో ఆరు రూట్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహించారు. మొత్తం మీద చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, భారీ ఓటింగ్ శాతంతో ముగిశాయని జిల్లా ఎన్నికల సహాయ అధికారి గుత్తా వెంకటరామిరెడ్డి తెలిపారు.



