Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్‌ ఐదుగురిని ప్రశ్నిస్తున్న సీఐడీ

హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్‌ ఐదుగురిని ప్రశ్నిస్తున్న సీఐడీ

- Advertisement -

– ఎస్‌ఆర్‌హెచ్‌ను బెదిరించలేదు
– వ్యక్తిగతంగా పదిశాతం టిక్కెట్లు అడిగింది నిజమే
– ఒప్పుకున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు
– ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల నిధుల గోల్‌మాల్‌పై సీఐడీ అధికారులు తమ కస్టడీలో ఉన్న ఐదుగురు నిందితులను నిశితంగా ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంపై దర్యాప్తును చేపట్టిన సీఐడీ.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్‌, గౌలీపుర క్రికెట్‌ అసోసియేషన్‌ నాయకులు రాజేందర్‌యాదవ్‌, ఆయన భార్య కవితలను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించటానికి ఆరు రోజుల పాటు కోర్టు అనుమతించటంతో సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గురువారం సాగిన విచారణలో జగన్మోహన్‌రావును విచారించిన అధికారులు.. ఆయన హెచ్‌సీఏలోకి దొడ్డిదారిలో ప్రవేశించిన వైనంతో పాటు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న కుంభకోణం, ఎస్‌ఆర్‌హెచ్‌ టీం యాజమాన్యాన్ని పది శాతం అదనపు టిక్కెట్ల కోసం వేధించిన వైనంపై ప్రశ్నించారని తెలిసింది. అయితే తాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) యాజమాన్యాన్ని బెదిరించలేదనీ, పది శాతం టిక్కెట్లు కావాలని కోరిన మాట నిజమేననీ, జగన్మోహన్‌రావు అంగీకరించినట్టు సమాచారం.

ఇక ఇతర ఆర్థిక లావాదేవీలలో చోటు చేసుకున్న గోల్‌మాల్‌పై జగన్మోహన్‌రావు నోరు మెదపలేదని తెలిసింది. ఇక జగన్మోహన్‌రావుకు సహకరించిన వైనంపై శ్రీనివాస్‌రావు, సునీల్‌, రాజేందర్‌యాదవ్‌, కవితలను సీఐడీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అయితే వీరిలో కొందరు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. అలాగే ఈ కేసులో ఇంకా తప్పించుకొని తిరుగుతున్న హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి గురించి కూడా అధికారులు వీరిని ఆరా తీశారని సమాచారం.

సీఐడీ నుంచి సమాచారం కోరిన ఈడీ
ఇదిలా ఉంటే బీసీసీఐ నుంచి మంజూరైన దాదాపు రూ.500 కోట్లకు సంబంధించి అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ఆయన టీం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు ఆ దిశగా దృష్టిని సారించారు. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలను తమకు అందజేయాలని ఈడీ అధికారులు కోరినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -