ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలి
సీఐటీయూ, టీయూసీఐ, ఏఐటీయూసీ డిమాండ్
మున్సిపల్ కార్మికుల ర్యాలీ, కమిషనర్ ఛాంబర్ ఎదుట ధర్నా
సొమ్మసిల్లి పడిపోయిన మహిళా కార్మికులు ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
సీఐజీ గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని సీఐటీయూ, టీయూసీఐ, ఏఐటీయూసీ డిమాండ్ చేశాయి. మూడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు.. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా, ధర్నా చౌక్ మీదుగా కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనర్ ఛాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు కార్మికులను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో కార్మికులు నినాదాలతో ఒక్కసారిగా చొచ్చుకుపోయి కమిషనర్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (సీఐజీ) ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారన్నారు. వాటర్ వర్క్స్ కార్మికులు, డ్రైవర్లు సీఐజీ గ్రూపుల్లో లేరని తెలిపారు. వీరిని మాత్రమే కొత్తగా గ్రూపులుగా చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను రద్దుచేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదని, దీనివల్ల పనిభారం పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది, వాటర్ వర్క్స్ కార్మికులను 25 నుంచి 35 మందితో ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలన్నారు. పాత సీఐజీ గ్రూపులను కదపాలని చూస్తే పెద్దఎత్తున ఆందోళనలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి సీఐజీ గ్రూపు కార్మికులకు వేతనాల ఆపడం అన్యాయమన్నారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో నేటి సాయంత్రంలోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలన్నారు. కేటగిరీల వారీగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇస్తున్నట్టు వేతనాలు చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్‌ఐలో ఉన్న తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని అడిషనల్ కమిషర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్‌ను కలవడానికి వెళ్ళిన కార్మికుల్లో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు భూపతి, రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, శివకుమార్, భానుచందర్, మహేష్, యాదమ్మ, లక్ష్మి, శైలజ, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
సీఐజీ గ్రూపులను యధావిధిగా కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



