మేధావులు తమ మెదడును చదువుకోవడానికి ఉపయోగించే లాంతరులా కాకుండా, అందరికీ దారిచూపే ‘లైట్‌హౌస్’లా ఉపయోగించాలి. ప్రతిఒక్కరి ఆలోచనలు, పనులు, సంపాదన పరిశుభ్రంగా ఉండాలి. ఇతరులతో నీతిగా వ్యవహరించడం, నిజాయితీగా జీవించడం అలవరుచుకోవాలి. కానీ, సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న కొన్ని రంగాలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా తెలిసి తెలిసి అనైతికతను వ్యాప్తిచేస్తున్నాయి.
ఇప్పుడు దేశంలో యువతరాన్ని ఆకర్షిస్తున్న రంగాలు మూడు. 1.సినిమా 2.రాజకీయాలు 3.క్రికెట్. కారణం ఏమిటంటే ఈ మూడు రంగాల్లో విపరీతంగా, సులభంగా డబ్బు వస్తుంది. త్వరితగతిన ప్రసిద్ధి లభిస్తుంది. నైతికతకు, శీలానికి అంతగా ప్రాముఖ్యముండదు. వాటిని వదిలేస్తూ ముందుకు దూసుకుపోవడమే ఆయా రంగాల్లో ఉన్నవారి ధ్యేయం! సమాజం ఎటుపోయినా, దేశం ఏమైపోయినా వారికి అంతగా పట్టదు. సమాజ చైతన్యం, సమాజోద్దరణ వంటివి వారికి అంతగా పట్టని విషయాలు. పైగా, సగటు మనుషులకన్నా తాము ఉన్నతులమనీ అహంభావంతో ఉంటారు. ఇందులో నటులు రాజకీయాలు చెయ్యొచ్చు.
రాజకీయ నాయకులు నటించనూవచ్చు. అయితే వీరందరికీ క్రీడా కారులకు ఉండాల్సిన స్ఫూర్తి ఉండాలి. సాధించాలన్న పట్టుదల,. ఉత్సాహం లేనిది ఎవరైనా, ఏ రంగంలో నైనా రాణించలేరు కదా? నిరాశా నిస్పృహలు ఎదురైనా ఓర్చుకుని విజయపథంలో దూసుకుపోవడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. విజయపథం అంటే మరేం లేదు. డబ్బు సంపాదించి పోగెయ్యడం. పెద్దపెద్దవాళ్లతో స్నేహాలు, సంబంధాలు పెంచుకోవడం, పరపతి పెరిగిందని, ప్రముఖులమై పోయామని అనుకోవడం. వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్థానికి ప్రాముఖ్యమిచ్చే వీరికి, బాధ్యతగల పౌరులుగా సమాజబాధ్యత గుర్తుకురాదు. తమ భద్రత, తమ వారసుల భద్రత గురించి ఆందోళన పడడం తప్ప, సమాజ భద్రత గురించి వారికి ఆలోచనే ఉండదు. కానీ, సమాజంలోని సామాన్యుల్ని మాత్రం, తమ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు.
సినిమాహాళ్లలోని ప్రేక్షకులు సినీ నటీనటులకు కావాలి. స్టేడియంలోని ప్రేక్షకులు క్రీడాకారులకు కావాలి. సమాజంలోని ఓటర్లు రాజకీయ నాయకులకు కావాలి. సామాన్య జనం లేనిది వీరిలో ఎవరికీ గుర్తింపే ఉండదు. సమాజాన్ని, సామాన్య జనాన్ని మెట్లలా ఉపయో గించుకుని, ఉన్నత శిఖరాలకు చేరుకునేది వీళ్లే! అయితే జనం పట్ల వీరికి వినమ్ర భావనా, కృతజ్ఞతా ఉండదు. ఆ పిచ్చివాళ్ల వెర్రి అలాగే ఉంటూ తమ స్థాయిని పెంచుతూ ఉండాలని ఆశపడుతుంటారు. సినిమాలో హీరో గనక దొంగయితే దొంగతనం ఒక సాహసవంతుడి ఘన కార్యమన్నట్టు దర్శకుడు చూపిస్తాడు. ఈ వెర్రి ప్రేక్షకులు కూడా దొంగతనం ఎంతబావుందో- అని ఆనందిస్తారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే! ఆ దొంగకు చదువురాదు. తెలివి ఉండదు. దేశ ప్రజల మూర్ఖత్వం వల్ల ఆ దొంగే దేశానికి రాజయ్యాడనుకోండి. ఇకనేం? చదువు రాకపోవడం అనేది ఒక గొప్ప లక్షణమవుతుంది. అనైతిక ప్రవర్తన ఒక గొప్ప లక్షణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అతను పిచ్చివాగుడుతో నీళ్లు కార్చుకుంటున్నా, ప్రేక్షకులు తన్మయులై వింటారు. భద్రత కల్పిస్తూ గౌరవించుకోవాల్సిన స్త్రీలను మణిపూర్ వీధుల్లో నగంగా నడిపించినా ఆ రాజకీయ దొంగ హీరోకు చీమ కుట్టదు. బాధ అనేది ఉండదు. ఈ దేశానికి నువ్వు రాజువురా. అని ఎవరైనా గుర్తు చేసినా, వినిపించుకోడు. కార్పొరేట్ పెత్తందార్ల ఇండ్ల ముందు సాగిలబడి పాలేరుగా పడి ఉంటానంటాడు. ఈ దొంగ హీరోకున్న ఒక దొంగ అసిస్టెంట్ నాలుగు రోడ్ల కూడలిలో చర్నాకోలాతో కొట్టుకుంటూ ప్రదర్శన ఇచ్చినా, అదొక సాహసోపేతమైన కార్యక్రమంగా జనం చూస్తారు. మనసులో నవ్వుకున్నది బయటికి కనబడదు కదా?
ఈ దేశపరిస్థితి ఇంతకన్నా ఏముందీ? గత వైభవం తలుచుకుంటూ సామాన్యులంతా కుమిలిపోవడం తప్ప, వారికి మరో మార్గ ముందా?అసలు ఈదేశంలో ఏం జరుగుతోంది? సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ఏ పనులైనా జరుగుతున్నాయా? నిద్రపోతే టాక్సు, నిద్రలేస్తే టాక్సు, గాలి పీలిస్తే టాక్సు, గాలి వదిలితే టాక్సు, నీళ్లు తాగితే టాక్సు, అన్నం తింటే టాక్సు, సగటు మనిషి బతికేది ఎట్లా? – అని మనమో లేక మనలాంటి వాళ్లో ప్రశ్నించారనుకోండి. ఓహో- ఇంకా బతికే ఉన్నారా? బతికి ఉన్నందుకు టాక్సులు కొట్టండి అంటుంది నేటి కేంద్ర ప్రభుత్వం! ఇందులో అతిశయోక్తులేవీ లేవండీ బాబూ – ఆలోచించి చూడండి. విషయం మీకే అర్థమవుతుంది. వాస్తవం ఏమిటంటే- పరిస్థితులు ఇంతకన్నా ఘోరంగా ఉన్నాయి –
ఆది మానవుడి మెదడు వికసించలేదు. అయినా, అతను పేడ తిని, ఆవు మూత్రం తాగలేదు. అంతెందుకూ? అప్పుడే పుట్టిన లేగ దూడకు కూడా తెలుసు. పాలే తాగాలని! తల్లి పొదుగు వెతుకుని పాలు తాగుతుంది. తప్పించి వెనక్కి వెళ్లి మూత్రం మాత్రం తాగదు! మరి ఈ దేశంలో రాజకీయాలేమిటీ? ఆవుపేడ, ఆవు మూత్రంలో మునిగి పోతున్నాయీ? రాజనీతి అనేది సేవనా? లేక ఉద్యోగమా? అనేది తేలడం లేదు. సేవ- అయితే, జీత భత్యాలూ, పెన్షన్లూ ఎందుకూ? ఉచితంగా చేస్తేనే అది సేవ అవుతుంది.
ఒక వేళ అది ఉద్యోగమే అయితే- యోగ్యతను పరీక్షించే పరీక్షలూ ఇంటర్ప్యూలు లేవెందుకూ? దేశంలో ప్రస్తుత రాజకీయాలు ఏం చేస్తున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం కదా? మూర్ఖులకు విడిగా ప్రత్యేకమైన అంగళ్లు ఏవీ ఉండడం లేదు – ఉండవు. మూర్ఖుల బుద్ది ఎక్కడ ఎప్పుడు ఆప్పుపట్టిపోతుందో- అక్కడే వాళ్ల దుకాణాలు తెరుచుకుని కూర్చుంటారన్నమాట! అలా దుకాణం తెరుచుకుని కూర్చునే వాడు, తన హోదా, స్థాయి కూడా పట్టించుకోడు. ఏ మాత్రం సంకోచించకుండా తన మూర్ఖత్వ దుకాణం ఎక్కడైనా పెట్టేసుకోగలడు. అయితే, ఎక్కడోచోట కొద్దిపాటి మినహాయింపులు ఉన్నాయి. ఆ విషయం కూడా మనం మరిచిపోగూడదు.
చిన్నపిల్లలు చీకటి చూస్తే భయపడతారు-అది సహజం. చీకటి అజ్ఞానానికి, అయోమయానికి, భయానికీ సంకేతం. విచారించదగిన విషయమేమంటే- ఆ పిల్లలే పెద్దవాళ్లయ్యాక వెలుగును చూసి భయపడుతున్నారు. వెలుగు – జ్ఞానానికి, సత్యానికి, వాస్తవానికి, నైతికతకు సంకేతం. అందుకే కాబోలు ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ప్లేటో అంటాడు – ”సమాజంలో అధిక సంఖ్యాకుల్ని చూడండి. వెలుగును భరించలేక చీకట్లో, మూఢత్వంలో దాక్కుంటున్నారు. ఇదెప్పటి మాట? సాధారణ శకానికంటే ముందు, 423 – 347 (బిసిఈ) నాటిది. సాధారణ శకంలో ఇరవై ఒకటవ శతాబ్దానికొచ్చినా, మనుషుల్లో మార్పులేక పోతే ఎలా? మనుషుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. శరీర భాగాలు బహిర్గతమైతే, తమ నగత్వానికి తెగ సిగ్గుపడతారు. పరువు పోయిందని బాధ పడతారు. కానీ, మెదడులోని ‘ఖాళీ’ బయట పడితే మాత్రం సిగ్గుపడరు. పైగా సిగ్గు లేకుండా తమ తెలివిలేని మెదళ్లను నగంగా ప్రదర్శించుకుంటారు. కొంతలో కొంత సామాన్య పౌరులు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారేమో గానీ, మనం చెప్పుకుంటున్న ఈ రంగాల్లోని ప్రముఖులకు ఆ స్పృహే ఉండదు. తమ ఖాళీ మెదళ్ల దుకాణాలు ధైర్యంగా తెరుచుకుని కూర్చుంటారు.
విప్లవవాదులమని చెప్పుకుని, సిగ్గు వదిలేసి, సనాతనానికి ఊడిగం చేసే గాలిపాటంగాళ్లు కొందరుంటారు. వారిని మనం నిత్యం రాజకీయ రంగంలో చూస్తూనే ఉన్నాం. సనాతన ధర్మం ప్రకారం మన యజ్ఞాలకు, తంత్రాలకు, మంత్రాలకు చాలాశక్తి ఉందన్నది-నిజమే అయితే, మరి అదేమిటో ఈ దేశాన్ని పాలించిన మొఘలుల్ని, బ్రిటీష్ వారిని సనాతనులు ఏమీ చేయలేక పోయారెందుకూ? పైగా వారి అడుగులకు మడుగులొత్తుతూ బతుకులు వెళ్లబోసుకున్నారెందుకూ? చరిత్ర తిరగేయండి. వాస్తవాలు తెలుస్తాయి. ఏ సనాతనుడైనా రాజ్యానికి ఎదురు తిరిగిపోరాడిన సంఘటనలున్నాయా? అధికారంలో ఎవరుంటే వారికి లొంగిపోయి క్షమాపణలు కోరటమేకదా ఈ ”పవిత్రులు” చేసిందీ? ఏది సరైన పద్ధతో తెలుసుకోవాలంటే వినాలి! చదవాలి !! తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేనిగురించి ఆలోచించాలో చెపుతారు. పుస్తకాలు, సమాజం కూడా చెపుతాయి. వాటిని స్వీకరించి, స్వంత నిర్ణయాలు తీసుకుని, జీవితంలో ముందుకు పోవడమన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి. అందుకే జర్మన్ తత్వవేత్త ఫెడ్రిచ్ నీషే అంటాడు. ”నీ దారిలో రాళ్లు ఉండడమనేది సహజం! నువ్వు వాటిని అడ్డంకి అనుకుంటావా? లేక వాటినే మెట్లుగా మార్చుకుంటావా? అన్నది నీ ఆలోచనా ధోరణికి సంబంధించింది” -అని!
లైంగికదాడి, హత్యలు వంటి తీవ్రమైన నేరాల కారణంగా జీవితఖైదు అనుభవిస్తున్న డేరాబాబాకు ఆరుసార్లు పెరోల్ ఇచ్చిన జడ్జి సునీల్ సంగ్వాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీ వాషింగ్ మిషన్‌లో చేరిన మూడు రోజులకే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దొరికింది. ఆ పార్టీ అంతటి పవిత్రమైన పార్టీ మరొకటి దేశంలో లేదు. డేరా బాబా జైలుకు వెళ్లక ముందు ప్రధాని మోడీ డేరా బాబాతో కలిసి, ఆ బాబా విమానంలోనే అనేకసార్లు ప్రయాణించాడు. మన దేశ ప్రధాని ఎంత నీతిమంతుడో ఈ సంఘటన వల్ల తెలియడం లేదా? ఇకపోతే, 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను గల్ఫ్ దేశాలు మన భారత దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాయని ఒక హైందవా సంస్థ ప్రకటించింది. ఆవుపేడ విలువైన, ప్రయోజనకరమైన పోషకాలు కలదని గల్ఫ్ దేశాల వారు కనుగొన్నారు. ఆ విషయం మన దేశ ప్రజలు అర్థం చేసుకో వడం లేదని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు విషయమేమంటే.. వారు దిగుమతి చేసుకునేది వారి ఖర్జూర చెట్లకు ఎరువుగా వాడడానికి! తినడానికి కాదు – ఈ విషయం తెలిశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఇక్కడ దేశంలో ఆవు పేడతినే బ్యాచ్ ఏమైపోవాలీ? వారు మలమల మాడిపోవాల్సిందేనా?ఈ దేశవాసుల ప్రయోజనం ముఖ్యం కదా? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటుందో చూద్దాం!
”మనం లాఠీలు, తూటాలు ఎదుర్కోగలం! కానీ, నియంతలు ప్రశ్నలను కూడా ఎదుర్కోలేరు” అని అన్నాడు మన తెలుగుకవి గుంటూరు శేషేంద్రశర్మ. ఇంతకన్నా మరికొంత వివరంగా చెప్పాడు ఇంగ్లీషు కవి బైరన్. ”ప్రశ్నించని పండితుడు ఒక కరుడు గట్టిన సంప్రదాయవాది! ప్రశ్నించడం చేతకానివాడు మూర్ఖుడు!! ప్రశ్నించడ మనేది తెలియనివాడూ, గొంతు పెగలనివాడు ఓ బానిస!” ఇప్పటి మన దేశ కాల పరిస్థితుల ను ఊహించి, ఆయన సుమారు 200 ఏండ్ల క్రితమే ఆమాట చెప్పినట్టున్నాడు!
– కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలి గ్రహీత
డాక్టర్ దేవరాజు మహారాజు
అనైతికతను వ్యాప్తిచేస్తున్న సినీ, రాజకీయ క్రీడారంగాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES