ఉబెర్ మహిళా డ్రైవర్‌కు సంబంధించిన హృదయ విధారక కథ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బతుకుతెరువుకై డ్రైవింగ్‌ను ఎంపిక చేసుకున్న మహిళల జీవితాలకు ఇది ఒక నిదర్శనం. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా… అలా వాళ్లు రాణించడం వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని సవాళ్లు దాగి ఉంటున్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చేస్తుంది ఈ సందేశం.
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక మహిళా ఉబెర్ డ్రైవర్ గతంలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేసింది. తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా మారింది. తన ఈ ప్రయాణంలో అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంది. ఆ విషయాలన్నీ ఓ ప్రయాణికురాలితో పంచుకుంది. ఆమె చెప్పినవన్నీ వింటే పట్టణ ప్రజలు ఇప్పటికీ మహిళా డ్రైవర్లపై ఎంతటి వివక్ష చూపుతున్నారో మన కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
ఆశ్చర్యం, ఆనందం
అమియాన్షి శ్రీవాస్తవ అనే విద్యార్థి ఇటీవల ఉబెర్ నడిపే మహిళా డ్రైవర్ జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక రోజు ఉదయం ఆమె ఉబెర్ బుక్ చేసుకుంది. తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన మహిళా డ్రైవర్‌ను చూసి అమియాన్షి ఆశ్చర్యపోయింది. ‘అది ఆమెకు సాధారణమై ఉండొచ్చు. కానీ నాకు అలా కాదు. ఆమెను ఉబెర్ డ్రైవింగ్ సీట్లో చూసి ఆశ్చర్యం, ఆనందం రెండూ అనుభవించాను’ అంటూ ఆమె పంచుకుంది. క్యాబ్‌లో కూర్చున్న తర్వాత కొద్ది సేపటికి ఆమె ప్రశాంతంగా కనిపించింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అందుకే ఏసీ మరీ ఎక్కువగా పెట్టడడం లేదని ఆ మహిళా డ్రైవర్ అమియాన్షికాకు వివరణ ఇచ్చింది.
మరింత తెలుసుకునేందుకు
‘ఆమె నన్ను చూసి.. ‘మేడమ్, ఏసీ తోడా కమ్ చలేగా. పెట్రోల్ కాఫీ మెహెంగా హో గయా హై’ అని చెప్పింది. నేను సరే అన్నాను’ అని అమియాన్షి సోషల్ మీడియాలో రాసుకుంది. అయితే తన ప్రయాణం ప్రారంభించిన కొన్ని నిమిషాల తర్వాత అమియాన్షికి గురుగ్రామ్‌లోని ఆ మహిళా ఉబర్ డ్రైవర్ గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే ఆమె ఎంతకాలంగా డ్రైవింగ్ చేస్తుందో అడిగి తెలుసుకుంది. ‘నాలుగు సంవత్సరాలు’ అంటూ ఆమె ఎంతో సులభంగా చెప్పేసింది. ఆ నిర్లక్ష్య సమాధానం అమియాన్షినీ మరింత ఆకర్షించింది. వెంటనే తన తదుపరి ప్రశ్నలు మొదలుపెట్టింది.
పిల్లల కోసం…
ఒకప్పుడు ఆమె స్కూల్ టీచర్‌గా పని చేసేదనీ, అయితే తన భర్త గుండెపోటుతో మరణించిన తర్వాత తన ఇద్దరు పిల్లలకు మెరుగైన జీవితం అందించేందుకు డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాని పంచుకుంది. ‘ఆమెకు ఎదుగుతున్న ఇద్దరు పిల్లలున్నారు. ఇంకా వేచివుండటానికి ఆమె వద్ద సమయం లేదు. కాబట్టి కష్టమైన పని అని తెలిసినా డ్రైవింగ్ నేర్చుకుంది. ఓ స్నేహితుడి కారును అరువుగా తీసుకుని ఉబర్‌లో చేరింది. డ్రైవింగ్ ప్రారంభించింది’ అని వైరల్ అవుతున్న పోస్ట్‌లో అమియాన్షి పంచుకుంది.
అనేక సవాళ్లు
‘ప్రతిరోజూ ఆమె 12 గంటలు పని చేస్తుంది. మహిళలకు భద్రత లేని రాత్రుల్లో కూడా తప్పని సరి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని డ్రైవింగ్ చేస్తుంది. ‘లోగ్ మహిళా డ్రైవర్ నహీ చాహ్తే'(ప్రజలు మహిళా డ్రైవర్లను ఒప్పుకోరు). ఈ కారణం వల్ల ఆమె అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ఆమె రోడ్డుపై కనిపిస్తూనే ఉంటుంది. ఉదయం 9 నుండి రాత్రి 9గంటల వరకు డ్రైవ్ చేస్తుంది’ అని ఆ పోస్ట్‌లో జోడించింది. ‘నా పని విలాసవంతమైనది కాదు, చాలా కష్టపడాలి, అయినా పని చేయక తప్పని స్థితి’ అని మహిళా ఉబెర్ డ్రైవర్ పంచుకుంది.
ఆమెపై జాలి కలగదు
‘ఆమె తన పిల్లలను పాఠశాలకు పంపుతుంది. ఎవరిపైనా ఎలాంటి పిర్యాదూ చేయడం లేదు. అప్పుడప్పుడు ఇలా ఎవరైనా తన గురించి అడిగినప్పుడు మాత్రం పంచుకుంటుంది. ఆమె మాటల్లో ధైర్యం, దృఢత్వం మాత్రమే కాదు ఎక్కడా ఆమెపై మనకు జాలి కలగదు. అంతటి ఆత్మవిశ్వాసంతో ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఎందరిలోనే స్ఫూర్తి నింపుతుంది. ఇదే ఆమెను చాలా మంది నుండి వేరు చేస్తుంది’ అని అమియాన్షి రాసుకొచ్చారు.
నెటిజన్ల స్పందన
అమియాన్షి పెట్టిన పోస్టు చూసి చాలా మంది ఆ మహిళా డ్రైవర్ పోరాటం గురించి తెలుసుకుని నెటిజన్లు ఉలిక్కిపడ్డారు. అదే సందర్భంలో ఆమె గురించి చాలా మంది గర్వంగా కామెంట్లు పెట్టారు. ఉబెర్ మహిళలు విమానాలు కూడా నడపాలని కోరుకున్నారు. వీరి మెసేజ్లు ఎంతో హృదయపూర్వకంగా ఉన్నాయి. ఆమె పోరాటంలో వీరిని కూడా భాగస్వామ్యం చేసినందుకు నెటిజన్లు సంతోషంగా ఉన్నారు. ‘మేము కథనాలు, అవార్డు జాబితాలలో రోల్ మోడల్స్ కోసం వెతుకుతూ ఉంటాము. కొన్నిసార్లు వారు మిమ్మల్ని మీ గమ్యస్థానంలో దింపి అదృశ్యమవుతారు’, ‘అది నిజమైన శక్తి!! ఆ స్త్రీ పట్ల గర్వంగా ఉంది, ఆమె కలలన్నీ నిజం కావాలి’ అని ఒక నెటిజన్ పంచుకున్నారు.
కొత్త ఫీచర్స్ అవసరం
‘కొన్ని కథలు నాటకీయంగా ఉండవు, అవి చాలా మానవీయంగా ఉండటం వల్ల మీ హృదయాలను తాకుతాయి. ఈమె జీవితం కూడా అలాంటిదే. నిశ్శబ్దంగా, శక్తివంతంగా జీవించే వారికి కృతజ్ఞతలు’ అని మరొక నెటిజన్ అన్నారు. ‘మహిళా డ్రైవర్లు చాలా నిజాయితీగా, ధైర్యంగా ఉండటమే కాదు, ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటారు!’ అని ఒకరు పంచుకున్నారు. ఒకరైతే ఇలా సూచించారు.. ‘మహిళా డ్రైవర్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తారు. కనుక వినియోగ దారులు మహిళా డ్రైవర్లను అంగీకరించడానికి అవసరమైన ఫీచర్‌ను ప్రారంభించడం గురించి ఉబర్ ఆలోచించాలి’ అంటూ మెసేజ్ పెట్టారు.
– సలీమ