Thursday, November 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరేపటి పౌరులు…

రేపటి పౌరులు…

- Advertisement -

బాలల పట్ల అవ్యాజమైన ప్రేమను, వారి పరిపూర్ణ వ్యక్తిత్వవికాసానికి అవసరమైన నిర్భంధ ఉచిత విద్యను కల్పించిన వారు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ. అందుకే ఆయన జన్మదినం నవంబర్‌ 14ను పురస్కరించుకుని ప్రతియేటా దేశవ్యాప్తంగా 1957 నుంచి ”బాలల దినోత్సవం” నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. వారి హక్కులను పరిరక్షిస్తూ రేపటి భావిభారత పౌరుల అభ్యున్నతికి పునాదులు వేయగలగడంలో ప్రథమస్థానంలో ఉంటాడు నెహ్రూ. కానీ, నేడు చూస్తే స్వతంత్ర భారత శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న భారతంలో బాలల సమస్యలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి.

అందరికీ విద్య అందడం లేదు. పేదరికంలో మగ్గుతూ పోషకాహారానికి దూరమవుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ మనల్ని వెక్కిరిస్తున్నది. బాలల అక్రమ రవాణా సంక్షోభం దినదినం పెరుగుతున్నది. బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందరికీ ఆరోగ్యం అందని ద్రాక్షే అవుతున్నది. నాణ్యమైన ఉచిత విద్య కలగానే మిగిలి పోయింది. వీధి బాలలు నేటి డిజిటల్‌ భారతాన్ని వెక్కిరిస్తున్నారు. బలవంతపు భిక్షాటన మన కండ్ల ముందు జడలు విప్పుతోంది. బాలికలను అక్రమ రవాణా చేసి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్న దుర్భర పరిస్థితి నెలకొంది. దీన్ని అరికట్టాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఎండమావులే అవుతున్నాయి. ప్రమాదకరమైన పరిశ్రమల్లో చిన్నారుల భవిష్యత్తు మడి మసిబొగ్గు అవుతున్నది.

నేటి ప్రతి చిన్నారి రేపటి ఓ అద్భుత నిధి. భావిభారత బాలల పెంపకం, విద్య, పోషకాహారం, బాలల హక్కులు, ఆరోగ్యం లాంటి పలు సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి నేటి బాలల దినోత్సవ వేదికలు వినియోగించబడాలి. రేపటి భారత చరిత్రను ప్రభావితం చేయగల నేటి చిన్నారులపై నిర్లక్ష్యం దేశానికే పెనుశాపంగా మారుతుందని తెలుసుకోవాలి. బాలల దినోత్సవ వేదికగా పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనాదిగా జరుగుతోంది.

విద్యాలయాల్లో పోటీలు, కల్చరల్‌ ఆక్టివిటీస్‌, ర్యాలీలు, వ్యాసరచన, ప్రసంగాల వంటి పలు కార్యక్రమాలను నిర్వహించడం, చిన్నారుల భవిష్యత్తుకు పెద్దలు కంకణబద్దులు కావడం చేయాలి. దీనికితోడు ప్రభుత్వాలు వారి ఎదుగుదలకు కావాల్సిన పునాదుల్ని వేయడంలో కీలకపాత్ర పోషించాలి. రేపటి భారతావనికి వారే అమూల్య వనరులు, సుస్థిరాభివృద్ధికి ఊతం ఇవ్వగల పౌరులు. నేటి చిన్నారుల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పిల్లల తలరాతను మార్చాలి. నేటి బాలలే రేపటి పౌరులని గుర్తెరిగి ముందుకు సాగాలి.

  • బి.మధుసూదన్‌ రెడ్డి, 9949700037
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -