Tuesday, February 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో 'సివిక్‌ బిహేవియర్‌' అప్‌గ్రేడ్‌

చైనాలో ‘సివిక్‌ బిహేవియర్‌’ అప్‌గ్రేడ్‌

- Advertisement -

పౌరుల ప్రవర్తనలోనూ గణనీయమైన మార్పు
చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్న బీజింగ్‌ ప్రజలు

బీజింగ్‌ : ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. అయితే అది టెక్నాలజీకి మాత్రమే పరిమితం కాలేదు.. అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల ప్రవర్తనలో కూడా చాలా సానుకూలమైన మార్పులు వచ్చాయి. 2006లో కనిపించిన బీజింగ్‌కు ఇప్పటి బీజింగ్‌కు ‘భౌతికంగా’ చాలా తేడా కనిపిస్తున్నది. మెట్రో మార్గాల విస్తరణ, ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి ‘హార్డ్‌వేర్‌’ వృద్ధి మాత్రమే కాదు.. పౌరుల ప్రవర్తన (సివిక్‌ బిహేవియర్‌) అనే ‘సాఫ్ట్‌వేర్‌’ కూడా గణనీయంగా మారింది. ఈ రెండూ కూడా సమాంతరంగా వృద్ధి చెందాయి. అయితే బీజింగ్‌లో ఈ మార్పు సాధ్యం కావడానికి ఆర్థిక స్థిరత్వం (డబ్బు), పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు, విస్తృత నిఘాలే కారణాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ కలిసి చైనాలో ‘సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌’ను తీసుకొచ్చాయని విశ్లేషకులు చెప్తున్నారు.

2006లో బీజింగ్‌ నిర్మాణాల్లో మార్పులకు నోచుకుంటున్న నగరం. కానీ 2026లో అది పూర్తిగా అభివృద్ధి చెందిన మెట్రో వ్యవస్థ, రింగ్‌రోడ్లు, పచ్చదనం, శుభ్రమైన వీధులతో ఉన్న మెట్రోపాలిటన్‌ నగరం. అయితే అసలు విశేషం ఏమిటంటే ప్రజలలో వచ్చిన గణనీయమైన మార్పు. అక్కడ వీధుల్లో ఉమ్మివేయడం తగ్గింది. చెత్తవేయడం కనిపించదు. క్యూలల్లో నిలబడే అలవాటు ప్రజల్లో పెరిగింది. పబ్లిక్‌ ప్రదేశాల్లో నియమాలు పాటించటం అధికమైంది. దీనిని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌గా విశ్లేషకులు చెప్తున్నారు. రెండు దశాబ్దాల్లో చైనాలో అభివృద్ధి కేవలం మెట్రోలైన్లు, రింగ్‌రోడ్లు, ఆకాశహర్మ్యాలకు మాత్రమే పరిమితం కాలేదు… ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మెరుగైన మౌలిక వసతులు, విస్తృత నిఘా వంటి అంశాలు అన్నీ కలిసి అక్కడి ప్రజలలో గణనీయమైన మార్పునకు దోహదం చేశాయని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆర్థిక వృద్ధి
2005లో బీజింగ్‌ వ్యక్తిగత ఆదాయం సుమారు 2600 డాలర్లే. 2025 నాటికి అది 13000 డాలర్లకు పెరిగింది. ఆదాయం పెరిగితే ప్రజల జీవన శైలి, ప్రతిష్ట, సామాజిక బాధ్యతలు కూడా మారుతాయి. ఇప్పుడు బీజింగ్‌ ప్రజల విషయంలోనూ అదే కనిపించిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

మెరుగైన మౌలిక సదుపాయాలు
విస్తృత పచ్చదనం, శుభ్రమైన పార్కులు, మెరుగైన మరుగుదొడ్లు… ఇవి ప్రజలను మరింత బాధ్యతగా ప్రవర్తించేలా చేశాయి. సైకాలజీలో దీనిని ‘బ్రోకెన్‌ విండోస్‌ థియరీ’తో పోల్చవచ్చు. అంటే పరిసరాలు ఎలా ఉంటే, ప్రవర్తన కూడా అలానే
మారుతుంది.

మార్పునకు కారణాలు
-వేగవంతమైన పట్టణీకరణ
బీజింగ్‌లో వేగవంతమైన పట్టణీకరణ జరిగింది. ప్రతీ సదుపాయమూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. చైనాలో అనుసరిస్తున్న విధానాల కారణంగా ఇది సాధ్యమైంది. మేధావులు ఈ మార్పును ఒక పెద్ద సామాజిక మార్పుగా అభివర్ణిస్తున్నారు.

విస్తృత నిఘా
బీజింగ్‌ నగరమంతా కెమెరాలతో నిండి ఉంది. ప్రతీదీ రికార్డు అవుతుందనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇది వారిలో స్వీయ నియంత్రణను పెంచింది. దీనిని ఫ్రెంచ్‌ తత్వవేత్త మిషెల్‌ ఫూకో చెప్పిన ‘పనోప్టికాన్‌ ఎఫెక్ట్స్‌’కు ఉదాహరణగా చెప్పొచ్చు.ఎవరైనా చూస్తున్నారనే భావనతోనే మనిషి ప్రవర్తన మారుతుందనే విషయాన్ని మానసిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. కాగా ఇక్కడ కోవిడ్‌ సమయంలో ఏర్పాటు చేసిన కెమెరాలు ఇప్పటికీ పని చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -