– ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
– బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు
– మొదటి రోజే 17 కేసులు విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. అంతకుముందు సీజేఐగా విధులు నిర్వహించిన బీఆర్ గవాయ్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9 వరకూ సూర్యకాంత్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఆయన నిలిచారు. మరోపక్క బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 17 కేసులను విచారించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి భవన్‌ను వీడిన మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ తాను వచ్చిన అధికారిక కారును రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్టు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం సీజేఐగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, సీజేఐకి ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జస్టిస్ గవాయ్ కారును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ కారును అక్కడే వదిలివేయడం గమనార్హం.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



