– నివ్వెరబోయిన మంత్రి, కలెక్టర్
– పార్టీలో సహజమేనన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
– మంత్రి సూచన మేరకే వచ్చామన్న పీసీసీ అధికార ప్రతినిధి వర్గీయులు
నవతెలంగాణ-గజ్వేల్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, ఘర్షణకు దారి తీశాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గజ్వేల్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రావడంతో పీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గ్రూపుగా ముద్రపడిన అధికార ప్రతినిధి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మెన్ మద్దూరు మల్లారెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు విజరు కుమార్ సమావేశం జరిగే హాల్‌కు రావడంతో డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా దాడికి దిగారు. దాంతో ప్రోటోకాల్ పాటించి స్టేజ్ వద్దకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి రాకపోవడంతో ప్రత్యర్థి గ్రూపు మల్లారెడ్డి, నాయిని యాదగిరి, విజరు కుమార్ తదితరులు రావడం నర్సారెడ్డి గ్రూపు జీర్ణించుకోలేకపోయింది. దాంతో ఇరు గ్రూపుల మధ్య తోపులాట జరగడంతో పాటు స్వల్ప ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన చూసి జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని శాంతింప చేసే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. మల్లారెడ్డి, నాయిని యాదగిరిపై మైనార్టీలు దాడి చేయగా, ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయకుమార్‌పై నర్సారెడ్డి దాడి చేసినట్టు ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చిన్నపాటి ఘర్షణలు, గొడవలు సహజమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమర్థించేలా చెప్పడం గమనార్హం. ఇలాంటి చిన్నపాటి ఘర్షణలుపెద్దగా పట్టించుకునే అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, తాము ఉదయం సిద్దిపేటలో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి పుష్పగుచ్చం అందజేశామని, అప్పుడు మంత్రి సూచన మేరకే గజ్వేల్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల కార్యక్రమానికి హాజరైనట్టు పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఎస్‌ఎస్‌ఎల్ జిల్లా అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు. తమపై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. వారిపై పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు.
గజ్వేల్ కాంగ్రెస్‌లో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES