నామమాత్రపు పర్యవేక్షణతో సరిపెడుతున్న అధికారులు
నెరవేరని స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాలు
నిధుల విడుదలలో కేంద్ర, రాష్ట్రాల ఉదాశీనత
న్యూఢిల్లీ : దేశంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్య కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను ప్రారంభించి పదకొండు సంవత్సరాలు గడిచాయి. 2024-25 నాటికి సంపూర్ణ స్వచ్ఛత సాధించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. వ్యర్థాలను నిర్వహించడం, మురుగు నీటిని శుద్ధి చేయడం, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.
నిర్వహణ అధ్వాన్నం
2019 అక్టోబర్ నాటికి దేశంలో ఏ గ్రామంలోనూ బహిరంగ మల విసర్జన జరగరాదని (ఓడీఎఫ్) కార్యక్రమం యొక్క తొలి దశ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా పది కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న విధంగానే 11.9 కోట్ల వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్లను, 2,60,000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను నిర్మించారు. పేద ప్రజలు, రాకపోకలు సాగించే జనం కోసం ఈ కాంప్లెక్సుల్లో మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునే కేంద్రాలు, వ్యర్థాల తొలగింపు సౌకర్యాలు ఉంటాయి. అయితే వీటి నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నదని, సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఇండియాస్పెండ్ అనే సంస్థ తన నివేదికలో తెలియజేసింది. మొదటి దశను పూర్తి చేయడానికి రూ.66,000 కోట్లు ఖర్చు చేశారు.
తూతూ మంత్రంగా…
ఇక రెండో దశలో అన్ని గ్రామాలకూ ఓడీఎఫ్-ప్లస్ స్టేటస్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. 2019 అక్టోబర్ 1వ తేదీ నాటికి 97 శాతం గ్రామాలకు ఓడీఎఫ్-ప్లస్ స్టేటస్ ఇచ్చేశారు కూడా. ఈ స్టేటస్ ఇవ్వాలంటే గ్రామాలను రెండు పర్యాయాలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. మూడు ప్రమాణాలను నిర్దేశించి వాటిని నెరవేర్చిన గ్రామాలను ‘ఓడీఎఫ్-ప్లస్ మోడల్’ గ్రామాలుగా గుర్తించారు. మొత్తం 5,86,944 గ్రామాలు ఉండగా వాటిలో 4,80,412 గ్రామాలు…అంటే ప్రతి ఐదు గ్రామాలలో నాలుగింటికి ఈ స్టేటస్ ఇచ్చారు. అయితే ఈ గ్రామాలలో 22 శాతం గ్రామాలలో కనీసం మొదటి రౌండ్ పరిశీలన కూడా జరపలేదు. 89 గ్రామాలలో రెండో రౌండ్ పరిశీలన జరగలేదు.
అంటే ఎలాంటి పరిశీలన జరపకుండానే గ్రామాలలో బహిరంగ మల విసర్జన ఆగిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చేశారన్న మాట. ఇంటిలో మరుగుదొడ్ది ఉన్నదా, మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్నదా, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ జరుగుతోందా, బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతోందా అనే అంశాలను రెండు విడతలుగా పరిశీలించి ఈ స్టేటస్ ఇవ్వాల్సి ఉండగా అంతా తూతూ మంత్రంగా జరిగిపోతోంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. పలు లక్ష్యాలతో కూడిన ఈ కార్య క్రమాన్ని నిర్వహించడం ఏజెన్సీలకు తలకు మించిన భారంగా మారింది. నిధులేమో పరిమితంగా ఉంటాయి. పర్యవేక్షణ కోసం సిబ్బంది అవసరం అధికంగా ఉంటుంది.
అంతా ‘ఫీల్ గుడ్’
స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశకు రూ.1,40,881 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా 37 శాతం. ఈ దశకు కూడా మూడు ప్రమాణాలు నిర్దేశించారు. ఒక ప్రమాణాన్ని పాటిస్తే ‘యాస్పైరింగ్’ గ్రామమని, రెండు ప్రమాణాలు పాటిస్తే ‘రైజింగ్’ గ్రామమని, మూడు ప్రమాణాలనూ పాటిస్తే ‘మోడల్’ గ్రామమని అంటారు. దేశంలోని 82 శాతం గ్రామాలను మోడల్ గ్రామాలుగా, 14 శాతం గ్రామాలను యాస్పైరింగ్ గ్రామాలుగా, మిగిలిన వాటిని రైజింగ్ గ్రామాలుగా నిర్ణయించారు. దేశంలోని 753 జిల్లాలలో మూడో వంతు జిల్లాలకు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్ స్టేటస్ లభించింది. అంటే ఐదు వందల జిల్లాలలో లక్ష్యం నెరవేరలేదని స్పష్టమవుతోంది. ఎలాంటి పరిశీలన జరపకుండానే 1,03,627 మోడల్ గ్రామాల ఎంపిక జరిగిపోయింది. వీటిలో సగం గ్రామాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం.
నిధుల విడుదలలో జాప్యం
గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారుల ద్వారా పరిశీలన జరిపిస్తాయి. వారు ఏదో మొక్కబడిగా పరిశీలన జరుపుతారు. లేదా అసలు జరపనే జరపరు. కానీ కాగితాల మీద మాత్రం అంతా ‘స్వచ్ఛతే’ కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం కూడా పరిశీలన సరిగా జరగకపోవడానికి కారణమవుతోంది. 2020-21, 2022-23 మధ్యకాలంలో కేంద్రం తన వాటాలో యాభై శాతాన్ని కూడా రాష్ట్రాలకు విడుదల చేయలేదు. 2022-23లో హర్యానా, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రాలు కూడా తమ వంతు వాటాను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయి. ఆ ఏడాది పది రాష్ట్రాలు తమ నిధుల విడుదలలో 67 నుంచి 165 రోజులు ఆలస్యం చేశాయి.
నామమాత్రపు పరిశీలనతో…
సిక్కిం, లక్షద్వీప్‌ను మోడల్ రాష్ట్రాలుగా ప్రకటించారు. అంటే వాటిలోని గ్రామాలన్నీ ‘ఓడీఎఫ్-ప్లస్ మోడల్’ గ్రామాలే. అయితే సిక్కింలోని 400 గ్రామాలలో 17 గ్రామాలలో పరిశీలనే జరగలేదు. కేరళలో 98 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 97 శాతం పరిశీలన జరిగింది. మణిపూర్‌లో 2,567 గ్రామాలు ఉండగా వాటిలో 26 గ్రామాలను మోడల్‌గా ప్రకటించారు. కానీ వాటిలో ఏ ఒక్క గ్రామాన్నీ పరిశీలించిన పాపాన పోలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో పాతిక శాతం, జార్ఖండ్‌లో 27 శాతం వెరిఫికేషన్ జరిగింది. రెండో దశ కార్యక్రమం ముగింపు దశకు వచ్చే సరికి అనేక గ్రామాలు స్వీయ డిక్లరేషన్‌ను పూర్తి చేశాయి. అంటే అక్కడ పరిశీలన ఇంకా కొనసాగుతోందని అర్థం. డిక్లరేషన్ పూర్తయిన 90 రోజులలో పరిశీలన జరగాలని ఈ కార్యక్రమం నిర్దేశిస్తోంది.