గంటలోనే ముగిసిన లాంఛనం
విండీస్‌పై టెస్టు సిరీస్ కైవసం
రెండో టెస్టులో భారత్ ఘన విజయం
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ తొలి టెస్టు సిరీస్ విజయం అందుకుంది. న్యూఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. రెండు మ్యాచుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్‌సేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఐదో రోజు ఉదయం సెషన్లో గంటలోనే 58 పరుగులు పిండుకున్న భారత్ తొలి సెషన్లోనే లాంఛనం ముగించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
స్వదేశంలో టెస్టు సిరీస్‌ను టీమ్ ఇండియా తనదైన శైలిలో ముగించింది. ఐదో రోజు వరకు సాగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ టెస్టులో రెండున్నర రోజుల్లోనే శుభ్‌మన్‌సేనకు తలొంచిన కరీబియన్లు.. ఢిల్లీ టెస్టులో గేర్ మార్చారు. పడుతూ లేస్తూ.. ఆతిథ్య జట్టు విజయం కోసం ఐదు రోజులు ఆగేలా చేయగలిగింది. 121 పరుగుల లక్ష్యాన్ని భారత్ 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (58 నాటౌట్, 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (39, 76 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. ఎనిమిది వికెట్లతో మాయాజాలం చేసిన కుల్‌దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. రెండు టెస్టుల్లో కలిపి ఎనిమిది వికెట్లు సహా ఓ సెంచరీ బాదిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
గంటలోనే ముగించారు
ఓవర్‌నైట్ స్కోరు 63/1తో ఐదో రోజు ఛేదనకు వచ్చిన భారత్.. మరో 10.2 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (00) అవుటైనా.. ధ్రువ్ జురెల్ (0 నాటౌట్) తోడుగా ఓపెనర్ కెఎల్ రాహుల్ విజయాన్ని అందించాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 104 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కెఎల్ రాహుల్.. ఆడుతూ పాడుతూ భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. కరీబియన్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టుకు ఊరట కలిగించాడు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ ఛేజ్ మాయలో పడ్డారు. తొలి టెస్టులో రెండున్నర రోజుల్లోనే చేతులెత్తేసిన వెస్టిండీస్.. రెండో టెస్టులో ఐదు రోజులు పోరాడింది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా.. రెండో ఇన్నింగ్స్‌లో కాంప్‌బెల్, హౌప్ శతకాలతో భారత్‌ను మరోసారి బ్యాటింగ్‌కు పిలిచింది. ఎంతో వేగంగా పొరపాట్లను దిద్దుకునే ప్రయత్నం చేసిన వెస్టిండీస్.. ఢిల్లీ టెస్టులో ఓడినా గొప్ప పోరాట స్ఫూర్తి కనబరిచి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 518/10
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 248/10
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) : 390/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) ఫిలిప్ (బి) వారికన్ 8, రాహుల్ నాటౌట్ 58, సాయి సుదర్శన్ (సి) హౌప్ (బి) ఛేజ్ 39, శుభ్‌మన్ గిల్ (సి) గ్రీవ్స్ (బి) ఛేజ్ 13, ధ్రువ్ జురెల్ నాటౌట్ 6,
మొత్తం : (35.2 ఓవర్లలో 3 వికెట్లకు) 124.
వికెట్ల పతనం : 1-9, 2-88, 3-108.
బౌలింగ్ : జేడెన్ సీయల్స్ 3-0-14-0, జోమెల్ వారికన్ 15.2-4-39-1, ఖారీ పియర్రీ 8-035-0, రోస్టన్ ఛేజ్ 9-2-36-2.