– యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వాతావరణ అనుకూల పంటలు సాగుతో రైతుకు ఎంతో మేలు కలుగుతుందని, యాజమాన్య పద్దతులు పై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తు ఉండాలని డిప్యూటీ కలెక్టర్ మురళి వ్యవసాయ విద్యార్ధులకు సూచించారు. “వాతావరణ మార్పులు – సాగు పద్ధతులు” పై అధ్యయనం చేయడానికి న్యూఢిల్లీ,ముంబై నుండి వచ్చిన జాహ్నవి,సోనాల్ గోగే లతో డిప్యూటీ కలెక్టర్ మురళి శుక్రవారం అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలం అప్పారావు పేట పామాయిల్ పరిశ్రమను సందర్శించిన వారు పరిశ్రమ నిర్వహణ,గెలలు నుండి ఆయిల్ తీసే విధానం ను మేనేజర్ కళ్యాణ్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలోని బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్,పుట్టగొడుగుల పెంపకం,జీవ నియంత్రణ ఎరువుల పరిశోధనాలయం ను పరిశీలించారు.అలాగే కళాశాలలో ప్రాంగణంలో విద్యార్ధుల అధ్యయనం కోసం సాగు చేసే పరిశోధనా పంటలైన కొబ్బరి,ఆయిల్ పామ్ లో వివిధ అంతర పంటల గురించి తెలుసుకున్నారు.వాటి వల్ల రైతులకు జరిగే లాభాలు గురించి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్ వారికి వివరించారు. ఈ కళాశాలను సందర్శించడం ద్వారా ఎన్నో కొత్త రకాల పంటలు, వాటి సాగు విధానాలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం మోడల్ గురించి తెలుసుకోవడంతో పాటు, విద్యార్థులు పంటలను సొంతంగా సాగు చేయడం వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి అని, అదేవిధంగా సాంకేతికంగా కూడా రైతులు ముందుకు వెళ్లి,ఎంతో పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు.
కళాశాలలో కొబ్బరి పంటల గురించి వారికి వివరించడం,ఈ ప్రాంతంలో సాగు చేసే ఆయిల్ పామ్ , కొబ్బరి,వివిధ వాణిజ్య పంటలు,ఉద్యాన పంటలు మరియు వాటిలో సాగు చేస్తున్న అంతర పంటల సమాచారం తెలుసుకున్నారు. ఈ వ్యవసాయ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టి దానిలో పరిశోధనలు చేసి ఇంకా కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలని,తద్వారా రైతాంగానికి,విద్యార్థి లోకానికి కళాశాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రామకృష్ణ, వ్యవసాయ సహాయ సంచాలకులు రవికుమార్, స్థానిక వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి నాయుడు రాధాకృష్ణ ,విద్యార్థులు పాల్గొన్నారు.



