ట్రంప్, జెలెన్‌స్కీ ఆశాభావం
‘భూభాగం’పై అంగీకారం కుదరలేదన్న నేతలు
ఫ్లోరిడా : రష్యా-ఉక్రెయిన్ మధ్య త్వరలోనే శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు ఆదివారం ఫ్లోరిడా లోని మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో సమావేశమయ్యారు. అనంతరం జెలెన్‌స్కీతో కలిసి ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రష్యా, ఉక్రెయిన్ దేశాలు శాంతి ఒప్పందానికి చేరువయ్యాయని తెలిపారు. అంతకు ముందు ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఎంతో పురోగతి సాధించామని ట్రంప్ చెప్పారు. గతవారం ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై 90 శాతం అంగీకారం కుదిరిందని జెలెన్‌స్కీ అన్నారు. ‘శాశ్వత శాంతి సాధనకు భద్రతాపరమైన గ్యారంటీ కీలకమైన మైలురాయి అని మేము అంగీకరించాం. మా బృందాలు అన్ని అంశాలపై చర్చిస్తాయి’ అని తెలిపారు.
ఒకటి రెండు అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి : ట్రంప్
అయితే ఉక్రెయిన్ భూభాగంపై చర్చల సందర్భంగా ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఒకటి రెండు సంక్లిష్టమైన అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని ట్రంప్ అంగీకరించారు. వీటిలో తూర్పు డాన్‌బాస్ ప్రాంతం కూడా ఉంది. 2022లో పూర్తి స్థాయిలో దాడి చేసిన తర్వాత రష్యా దీనిని స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలోని కొన్ని భాగాలలో ‘స్వేచ్ఛా ఆర్థిక మండలి’ని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనపై ఒప్పందానికి ఇరు పక్షాలు చేరువయ్యాయని ట్రంప్ చెప్పారు. ‘అంగీకారం కుదిరిందని నేను చెప్పలేను. అయితే దానికి చేరువయ్యాం. అది పెద్ద సమస్య. నిజంగా…పెద్ద సమస్యలలో అది ఒకటి. అది పరిష్కారం కాలేదు’ అని తెలిపారు.
ప్రజలే నిర్ణయించాలి : జెలెన్‌స్కీ
భూభాగం సమస్యపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉక్రెయిన్ ప్రజలేనన్న తన వైఖరిని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. శాంతి ప్రణాళికలోని పలు అంశాలను ప్రజల ముందు ఉంచి రిఫరెండం కోరతామని చెప్పారు. ‘మా సమాజమే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అది వారి భూమి. ఏ ఒక్కరిదో కాదు. అది మా దేశ భూభాగం…అనేక తరాలకు చెందింది’ అని అన్నారు. కాగా చర్చల అనంతరం ట్రంప్, జెలెన్‌స్కీ కీలక యూరోపియన్ నేతలతో ఫోన్‌లో సంభాషించారు. వీరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా ఉన్నారు. జెలెన్‌స్కీ ఫ్లోరిడా చేరుకోక ముందు పుతిన్‌తో ట్రంప్ గంటకు పైగా ఫోన్‌లో మాట్లాడారు. జెలెన్‌స్కీతో భేటీ తర్వాత మరోసారి మాట్లాడారు. పుతిన్‌తో మంచి సంభాషణ జరిగిందని, అది ఫలప్రదంగా ఉన్నదని తెలిపారు.



