Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంయుద్ధంలో క్లస్టర్‌ బాంబులు

యుద్ధంలో క్లస్టర్‌ బాంబులు

- Advertisement -

– ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఆరోపణలు
– టెహ్రాన్‌ ప్రతిదాడులను జీర్ణించుకోలేని టెల్‌అవీవ్‌
– అందుకే ఇలాంటి ఆరోపణలంటున్న విశ్లేషకులు
– గాజాపై రెండేండ్లుగా సాగించిన నరమేధం దేనికి నిదర్శనం?
– ఇజ్రాయిల్‌ది ద్వంద్వ వైఖరి అని వెల్లడి

న్యూఢిల్లీ : ఇరాన్‌పై దాడులకు దిగి, మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు. ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని చంపేసి, అమాయకపు పౌరుల ప్రాణాలను తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, ఇరాన్‌ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తూ, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మరీ యుద్ధానికి దిగాయి. అమెరికాతో కలిసి ఈ విధమైన దారుణమైన దాడులకు దిగిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఆరోపణ చేస్తున్నది. యుద్ధంలో భాగంగా ఇరాన్‌ తమపై క్లస్టర్‌ మ్యూనిషన్స్‌ను ఉపయోగించిందని ఆరోపిస్తోంది. మొన్నటి వరకు గాజాపై రెండేండ్లకు పైగా దాడులు చేసి వేలాది మంది ప్రాణాలను తీసుకుంది ఇజ్రాయిల్‌. నేడు ఇరాన్‌పై కూడా దారుణ చర్యలకు ఒడిగడుతోంది. దీంతో ఆత్మరక్షణ చర్యలో భాగంగా ఇరాన్‌ చేస్తున్న ప్రతిదాడులను మాత్రం ఇజ్రాయిల్‌ సహించలేక పోతోందనీ, ఇది ఆ దేశం ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.

విస్తృత ప్రాంతంలో చిన్న చిన్న పేలుడు పదార్థాలను వెదజల్లే క్లస్టర్‌ బాంబులు అంతర్జాతీయంగా వివాదాస్పదం, చాలా ప్రమాదకరం. తాజాగా ఇజ్రాయిల్‌ ఆరోపణలతో ఈ ఆయుధాలపై మళ్లీ చర్చ నడుస్తున్నది. ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌ ఇటీవల జరిగిన దాడుల్లో ‘క్లస్టర్‌ బాంబులు’ అనే వివాదాస్పద ఆయుధాలను ఉపయోగించింది. ఈ బాంబులు గాల్లో పేలిపోయి చిన్న చిన్న పేలుడు పదార్థాలను విస్తృత ప్రాంతంలో వెదజల్లుతాయి. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉపయోగించడం అంతర్జాతీయ మానవతా చట్టా లను ఉల్లంఘించే చర్యగా భావి స్తారు. యుద్ధం ప్రారంభమైన ప్పటి నుంచి ఇరాన్‌ పలుమార్లు క్లస్టర్‌ మ్యూనిషన్స్‌ ఉపయోగిం చిందని ఇజ్రాయిల్‌ సైన్య ప్రతి నిధి నాదావ్‌ షోషాని అన్నారు.

ఇవి చాలా ప్రమాదకరం : నిపుణులు
క్లస్టర్‌ బాంబులు చాలా ప్రమాదకర మైనవిగా నిపుణులు చెప్తున్నారు. ఇవి సాధారణ బాంబుల్లా ఒక్కసారి మాత్రమే పేలవు. బదులుగా.. గాలిలో పేలిపోయి అనేక చిన్న పేలుడు పదార్థాలు (బాంబ్లెట్స్‌) విస్తృత ప్రాంతంలో పడేలా చేస్తాయి. ఈ చిన్న బాంబ్లెట్స్‌ నేలపై పడిన వెంటనే పేలవచ్చు లేదా కొన్ని పేలకుండానే అలా నేలలో ఉండిపోవచ్చు. తర్వాత కూడా అవి ప్రమాదకరంగా మారి పౌరులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆయుధాలను ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రమాదకర మైనవిగా చూస్తున్నారు.

ఇరాన్‌ ప్రయోగించిన ఒక క్షిపణి సుమారు ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి, దాదాపు 20 చిన్న బాంబ్లెట్స్‌ సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో పడిపోయినట్టు ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు చెప్తున్నాయి. ఇలాంటి ఆయుధాలు యుద్ధంలో సైనిక లక్ష్యాలను మాత్రమే కాకుండా పౌరులను కూడా ప్రమాదంలో పడేస్తాయని విమర్శలు ఉన్నాయి. అందుకే 2008లో రూపొందించిన క్లస్టర్‌ మ్యూనిషన్స్‌ కన్వెన్షన్‌ అనే అంతర్జాతీయ ఒప్పందం.. వాటి వినియోగాన్ని నిషేధిం చింది. అయితే కొన్ని దేశాలు, ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయిల్‌ రెండూ ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. దీంతో అలాంటి దేశాలు ఈ ఒప్పందంలో భాగంగా లేవు.
లావోస్‌లో 50 ఏండ్లుగా బాంబ్లేట్స్‌ తొలగించే పనులు

ప్రపంచంలో 30కి పైగా దేశాలు ఇప్పటికీ పేలని క్లస్టర్‌ బాంబుల అవశేషాలతో బాధపడుతున్నాయి. లావోస్‌ దేశంలో యుద్ధం ముగి సిన తర్వాత కూడా 50 ఏండ్లకు పైగా చిన్న బాంబ్లేట్స్‌ను తొలగించే పని కొనసాగుతోంది. అయినప్పటికీ అక్కడి భూమిలో దాదాపు 30 శాతం ప్రాంతం ఇంకా ప్రమాదకరంగానే ఉంది.

వివిధ యుద్ధాల్లో పేలని బాంబ్లేట్స్‌ శాతం
వియత్నాం యుద్ధంలో బాంబీస్‌ బ్లూ-26 పేలని బాంబ్లేట్స్‌ సుమారు 30 శాతం వరకు ఉన్నాయి. లావోస్‌ ప్రపంచంలోనే తలసరి అత్యధిక బాంబింగ్‌కు గురైన దేశంగా ఉంది. ఇక్కడ సుమారు 40 శాతం వరకు పేలని బాంబ్లేట్స్‌ మిగిలిపోయాయి. లెబనాన్‌లో 2006 యుద్ధంలో సుమారు 25 శాతం బాంబ్లేట్స్‌ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇది 14 శాతం నుంచి 40శాతం వరకు ఉంటుందని అంచనా. ఒక క్లస్టర్‌ బాంబు పేలితే సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో చిన్న బాంబ్లేట్స్‌ చెలరేగుతాయి.

ఇజ్రాయిల్‌ ద్వంద్వ ప్రమాణాలు
మొన్నటి వరకు గాజాపై యుద్ధం పేరుతో చాలా దారుణాలకు ఒడిగట్టిన ఇజ్రాయిల్‌.. నేడు ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడికి దిగింది. గాజాలో భారీ కూంబింగ్‌, నివాస ప్రాంతాల విధ్వంసం, ఆస్పత్రులు, శరణాలయాలపై దాడులు వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించాయి. ఇజ్రాయిల్‌ చర్యలను పలు దేశాలు కూడా ఖండించాయి. ఇజ్రాయిల్‌ జరిపిన ఈ దాడుల్లో వేలాది మంది అమాయకపు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాను చేసిన దారుణాలపై ఆత్మ పరిశీలన చేసుకోని ఇజ్రాయిల్‌.. ఇప్పుడు ఇరాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని పరిశీలకులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇజ్రాయిల్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

అవశేషాల తొలగింపునకు భారీ ఖర్చు
క్లస్టర్‌ బాంబుల అవశేషాలు వ్యవసాయ భూములను ఉపయోగించకుండా చేస్తాయి. గ్రామీణ ప్రజలు పొలాల్లో పని చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఒకసారి యుద్ధంలో ఈ ఆయుధాలు వాడితే, ఆ దేశం దశాబ్దాల పాటు బాంబ్లేట్స్‌ను తొలగించే, శుభ్రపరిచే పనులపై భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ కారణంగా క్లస్టర్‌ బాంబులు తరాల పాటు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రమాదకర ఆయుధాలుగా మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

111కు పైగా దేశాల్లో బ్యాన్‌
క్లస్టర్‌ మ్యూనిషన్‌ కన్వెన్షన్‌ ప్రకారం క్లస్టర్‌ బాంబుల వినియోగం, బదిలీ, నిల్వ నిషేధం. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం 111కు పైగా దేశాలు క్లస్టర్‌ మ్యునిషన్స్‌ను బ్యాన్‌ చేశాయి. పేలకుండా ఉన్న బాంబ్లేట్స్‌ 25 ఏండ్ల పాటు క్రియాశీలకంగా ఉంటాయి. ఇలా పేలని బాంబ్లేట్స్‌ వల్ల జరిగే మరణాలు, గాయాల్లో దాదాపు 98 శాతం మంది సాధారణ పౌరులే ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పని చేసే రైతులు, పిల్లలు ప్రమాదానికి గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -