Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం18న మేడారానికి సీఎం, మంత్రుల రాక

18న మేడారానికి సీఎం, మంత్రుల రాక

- Advertisement -

– బహిరంగ సభకు ఏర్పాట్లు
– 19న మేడారం గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులప్రారంభోత్సవం
– పనులపై సమీక్షించిన మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు

ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు మేడారానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌., జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం చేరుకున్న అనంతరం అక్కడే బస చేయనున్నారని, 19న సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిపారు. 18న రాష్ట్రస్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండనున్నందున ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. క 18న ఆదివారం కావడం, పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగియనుండటంతో సందర్శకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ దృష్టితో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధి పనుల్లో సహకరిస్తున్న జిల్లా అధికారులు, వారి బృందాలకు, జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌ ప్రొటోకాల్‌, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్‌ నిర్వహణ పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. మేడారం జాతరతోపాటు గద్దెల ప్రాంగణ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీఓను ఆదేశించారు.ముఖ్యమంత్రి, వీఐపీ ప్రొటోకాల్‌ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్‌కు అప్పగించారు. బహిరంగ సభ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ధింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ తదితర సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి భద్రత, రూట్‌మ్యాప్‌, పార్కింగ్‌, గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఏర్పాట్లను ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేష్‌, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -