Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ విద్యాసంస్థల బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం

కార్పొరేట్‌ విద్యాసంస్థల బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం

- Advertisement -

ప్రభుత్వ విద్యను దెబ్బతీస్తున్నారు : ఎస్‌ఎఫ్‌ఐ విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక ప్రయివేటు పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ మండిపడింది. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. రజనీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యతలో ఉండి కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థలకు బహిరంగంగా మద్దతు తెలపడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొని ఉండగా, వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం వాటి బలహీనతలను ఎత్తిచూపడం ద్వారా ప్రజల్లో అవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

విద్యార్థులకు సరైన పఠనా నైపుణ్యాలు లేవని చెప్పడం ద్వారా ప్రభుత్వ విద్యను అపహాస్యం చేశారని ఆరోపించారు. విద్యాశాఖపై పూర్తి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించకుండా, ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు భారీ ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షించేందుకు పోటీ పడుతుండగా ప్రభుత్వం నిశ్చేష్టంగా ఉండటం దురదృష్టకరమని తెలిపారు. ముఖ్యమంత్రి తాను ప్రారంభించిన ప్రయివేట్‌ పాఠశాలను తన ”బ్రెయిన్‌ చైల్డ్‌”గా పేర్కొనడం ద్వారా తానే ఆ రంగానికి ప్రత్యక్ష ప్రోత్సాహకుడిగా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధమైన దిశలో ప్రభుత్వాన్ని నడిపించే చర్యగా అభివర్ణించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉండగా, నగరాల్లో ప్రయివేట్‌ విద్యాసంస్థల ఆధిపత్యం పెరిగిపోతోందని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని వారు పేర్కొన్నారు. తల్లిదండ్రులు బలవంతంగా తమ పిల్లలను ప్రయివేట్‌ పాఠశాలలకు పంపించే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రయివేట్‌ పాఠశాలల ఫీజులను నియంత్రించే చట్టాన్ని వెంటనే తీసుకురావాలనీ, ప్రభుత్వ విద్యను పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -