Monday, May 19, 2025
Homeరాష్ట్రీయంపీవీ శివ కుమార్‌ మృతి పట్ల సీఎం సంతాపం

పీవీ శివ కుమార్‌ మృతి పట్ల సీఎం సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీనియర్‌ ఫొటో జర్నలిస్టు పీవీ శివకుమార్‌ (66) అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ‘ది హిందూ ‘ పత్రికలో సీనియర్‌ స్పెషల్‌ న్యూస్‌ ఫొటో గ్రాఫర్‌గా పని చేసి రిటైరయ్యారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్‌ ఫొటో జర్నలిస్టుగా తన కెరీర్‌లో ఉత్తమ అవార్డులు అందుకోవటంతో పాటు పత్రికా రంగానికి విశేష సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శివకుమార్‌ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
బాధాకరం ఫొటో జర్నలిస్టుల సంతాపం
సీనియర్‌ ఫొటో జర్నలిస్టు పోచెంచర్ల వెంకట శివకుమార్‌ (పీవీ శివకు మార్‌) (66) ఆకస్మిక మృతి బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అనుమల్ల గంగాధర్‌, కె.ఎన్‌.హరి, కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పివి శివకుమార్‌ ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ (1985-1993), ది హిందూ దిన పత్రిక (1993-2015) ల్లో పని చేశారని తెలిపారు. సమర్థవంతమైన ఫోటోగ్రాఫర్లలో ఒకరైన ఆయన తన కెమెరాతో అద్భుత చిత్రాలను తీశారని గుర్తు చేశారు. ఆయన తన పనిలో ఎప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. చిత్రాలను బెస్ట్‌ క్వాలిటీతో అందించడానికి ఎంత మేరకైనా రిస్క్‌ తీసుకునే వారని పేర్కొన్నారు. ఏ చిత్రాన్ని ఏ కోణం నుండి షాట్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసని తెలిపారు. ఆ రోజుల్లో, ఫోటోగ్రాఫర్లకు ఇప్పటిలా కాకుండా చాలా కష్టాలు, సవాళ్లు ఉండేవని పేర్కొన్నారు. ఎంతో దూరం ప్రయాణించి , కష్టపడి తీసిన నెగటివ్స్‌ని డార్క్‌ రూమ్‌లో డెవలప్‌ చేసి ప్రింట్లు వేసి సమయానికి డెస్క్‌లో ఇవ్వాల్సి వస్తుండేదని తెలిపారు. శివకుమార్‌ అసైన్మెంట్‌ మీద వెళ్లారంటే గొప్ప ఫోటో ఇస్తారనే అంచనా డెస్క్‌లో ఉండేదని గుర్తు చేశారు. 1990ల్లో హైదరాబాద్‌ కర్ఫ్యూ సమయంలో తీసిన ఫోటోలతో పాటు 1996 అక్టోబర్‌లో ప్రకాశం జిల్లాలో తుఫాను సమయంలో, మోపాడు జలాశయం కట్ట తెగిపోవడంతో ధ్వంసమైన ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ తీసిన ఫోటోలు, మావోయిస్టు రామకృష్ణ ఇంటర్వ్యూలు, అనేక రాజకీయ సంఘటనల ఫోటోలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయని పేర్కొన్నారు. 2015 లో హిందూ పత్రిక నుంచి రిటైర్మెంట్‌ తర్వాత శివకుమార్‌ ఔత్సాహిక ఫోటో గ్రాఫర్స్‌కు ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్పారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -