కేరళ ఎన్నికలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి హస్తినకు బయల్దేరి వెళ్లిన ఆయన… కేరళ అసెంబ్లీ ఎన్నికల గురించి కేసీతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఇందిరా భవన్‌లో వీరు భేటీ అయ్యారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వేం నరేందర్‌రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు వేం నరేందర్‌రెడ్డి.. వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం, కేసీ…ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. వర్తమాన రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఎనిమిది మందితో ఏఐసీసీ కమిటీ వేసిన నేపథ్యంలో… దాని మార్గదర్శకత్వంలో పని చేయాలంటూ ఖర్గే ఆదేశించారు. దీంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవి, పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మెన్ పదవుల పంపకాలపై వారు చర్చించినట్టు సమాచారం. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామంటూ సీఎం వివరించారు. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనేత సల్మాన్ ఖుర్షీద్ రచించిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారనే చర్చ కొనసాగింది. కానీ సంబంధిత వివరాలేవీ వెల్లడి కాలేదు.
నేడు అసెంబ్లీలో పలు అంశాలపై ప్రశ్నోత్తరాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలను సంధించనున్నారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. వైద్యం, ఆరోగ్యం, వికలాంగులకు వివాహ ప్రోత్సాహకాలు, మూసీ పునరుజ్జీవం, ఆదర్శ పాఠశాలలకు భవనాలు, వయోవృద్ధులకు పింఛన్ల పెంపు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, రాజీవ్ యువ వికాసం పథకం, జనగాం నియోజకవర్గంలో రహదారులకు మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్ల నిర్మాణం తదితరాంశాలపై సభ్యులు ప్రశ్నలను వేయనున్నారు.
లోక్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో మంగళవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కేసీ వేణుగోపాల్‌తో సీఎం భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



