నవతెలంగాణ – హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌లో భారీ అవినీతి జరిగిందని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనతో జారీ చేసిన టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కుంభకోణంపై జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరపాలని కోరారు.
ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సూత్రధారి అని, ఆయన బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన లబ్ధిదారుడని హరీశ్ రావు ఆరోపించారు. నైనీ టెండర్‌ను రద్దు చేయడమే ఇందులో తీవ్ర అక్రమాలు జరిగాయనడానికి నిదర్శనమని అన్నారు. సీఎంకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను మార్చారని విమర్శించారు.



