9,300 ఎకరాల భూమిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర
ముఖ్యమంత్రిగా పాలమూరుకు చేసింది శూన్యం
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ఉ బుద్ధిచెప్పాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా పని చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హిల్ట్ విధానం పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, హెచ్‌సీయూ భూములపై పడ్డ రేవంత్ దృష్టి ఇప్పుడు హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు.
ఆ భూములను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారనీ, అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 9,300 ఎకరాల భూమిని ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ఐదారు వందల మంది కోసం రూ.ఐదు లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని విమర్శించారు.
గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరుకు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పది శాతం పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేయబోతున్నామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా సీఎం రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



