అంతర్జాతీయ నాయకులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశరాజధానిలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు హాజరైన ప్రపంచ నేతలకు ప్రధాని మోడీ బుధవారం విందు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం… ఈ విందుకు హాజరయ్యారు. దాదాపు అరగంటకు పైగా భారత్ మండపంలో గడిపారు. ఈ సందర్భంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు హాజరైన ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యూయేల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి ముచ్చటించినట్టు తెలిసింది. అలాగే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను మర్యాదపూర్వకంగా పలకరించారు.
ఖర్గే, రాహుల్‌లతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ…
అధిష్టానం పిలుపు మేరకు బుధవారం ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయఢంకా మోగించిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ టీమ్‌ను ఖర్గే, రాహుల్ అభినందించారు. పార్టీ పటిష్టత కోసం నేతలంతా మరింత సమన్వయంతో పనిచేయాలని నేతలు దిశా నిర్దేశం చేశారు.
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ భేటీ
నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ కీలక భేటీ నిర్వహించనుంది. ఇందిరా భవన్‌లో ఉదయం 10 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు రావాలన్న అధిష్టానం ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్య నేతలు బుధవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ముంబయిలో జరిగిన క్లైమెట్ వీక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి… అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు.
అలాగే రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మొత్తం రాష్ట్ర మంత్రి వర్గం, ఇన్‌ఛార్జి ఏఐసీసీ సెక్రెటరీలు, ఏఐసీసీ సెక్రెటరీలుగా ఉన్న రాష్ట్ర నేతలు ఢిల్లీకి వచ్చారు. మంత్రులు గడ్డం వివేక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఇతర మంత్రులు రాత్రికే హస్తినకు చేరుకున్నారు. అయితే… కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశం అవుతోన్న క్రమంలోనే రాష్ట్ర నేతలకు పిలుపు అందినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఈ భేటీలో క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, బీజేపి వ్యతిరేక ఆందోళనలపై హైకమాండ్ దిశానిర్ధేశం చేయనున్నట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం.
రాష్ట్రంలో పూర్వ వైభవం దిశగా…
తాజాగా రాష్ట్రంలో జరిగిన స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని చెప్తున్నాయి. గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీని పోటీలో లేకుండా చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా కాంగ్రెస్ సంఘటన్ అభియాన్‌లో భాగంగా గ్రామాలతో పాటు, మున్సిపాలిటీల వారిగా పట్టు పెంచుకోవాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజార్టీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో మరింత లోతుగా చర్చించనున్నారు.
రెండేండ్ల పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష…
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం సమీక్ష చేపట్టనుంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు… రాహుల్ గాంధీ దిశా నిర్దేశంలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, గిగ్ వర్కర్ల కోసం చట్టాలు వంటి అంశాలను కాంగ్రెస్ సర్కార్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ దిశలో అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందేలా పాలన సాగుతోంది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం పై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లు రిపోర్ట్‌లు అందజేయనున్నట్టు తెలిసింది. అలాగే త్వరలో జరిగే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం, అంతర్గతంగా పార్టీ బలోపేతం ఇతర అంశాలను అధిష్టానం ముందు పెట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ నుంచే షురూ…
2029 పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ దిశలో పార్టీని అన్ని రాష్ట్రాల్లో సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి ఉన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం, మంత్రుల సమన్వయంతో… ప్రచారం, వ్యూహాలు, ఇతర నిర్ణయాలు తెలంగాణ నుంచే షురూ చేయాలని పార్టీ ఆలోచన చేస్తోన్నట్టు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రాహుల్‌కు సపోర్ట్‌గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన లీడర్ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఉన్నా… ఆయన పార్టీ భారం మోయడంతోనే సరిపోతోంది. మరో జనరల్ సెక్రెటరీగా ప్రియాంక గాంధీ తమదైన కరిశ్మతో పార్టీకి తోడుగా ఉన్నా… మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం కన్పిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పేరు జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తోంది. రాహుల్ మాదిరిగా… రేవంత్‌కు యూత్‌ను కనెక్ట్ అయ్యే సామర్థ్యం, వాక్చాచాతుర్యం ప్లస్ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీలో మోడీ, అమిత్ షా ద్వయం మాదిరిగానే, కాంగ్రెస్‌లో రాహుల్‌కు రేవంత్ అవసరమని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే… ఈ కీలక భేటీలో రాష్ట్రంలో అనుసరించిన వ్యూహాలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌లను కట్టడి చేయడంలో కీలకంగా మారిన అంశాలపై సీఎం, పీసీసీ, రాష్ట్ర మంత్రులు మాట్లాడనున్నట్టు తెలిసింది. ఈ సక్సెస్ అంశాలను ఇతర రాష్ట్రాలు, 2029 ఎన్నికలకు ఎలా దోహదం చేస్తాయనే దానిపై కూడా చర్చించనున్నారు.
ప్రధాని విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
- Advertisement -
- Advertisement -



