అర్హత లేకున్నా కేఎల్‌ఎస్‌ఆర్‌కు రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులు
సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐవోలతో విచారణ చేయించాలన్న సుప్రీం
దృష్టి మరల్చడానికే సిట్ పేరుతో విచారణ డ్రామా
కేఎల్‌ఎస్‌ఆర్‌ను బ్లాక్ చేసి కాంట్రాక్టులను రద్దు చేయాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బినామీ కంపెనీకి దోచి పెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. కేల్‌ఎస్‌ఆర్ కంపెనీ ఆయనకు ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తున్నదో ఆధారాలతో సహా వివరించారు. ఆ కంపెనీ మొదటి నుంచి రేవంత్‌రెడ్డికి బినామీ కంపెనీగా వ్యవహరిస్తున్నదని అన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ అనే కంపెనీ న్యాయమూర్తులను ప్రలోభ పెట్టే విషయం నుంచి మొదలుకుని దివాలా తీసిన ఈ కంపెనీలో కొనసాగుతున్న రూ.వందల కోట్ల ఆర్థిక లావాదేవీలపైన నిగ్గుతేల్చాలంటూ సుప్రీంకోర్టు వారం కింద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. బినామీ కంపెనీ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే దావోస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సిట్ విచారణ పేరుతో డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి వాడుకున్నారని చెప్పారు. కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీపైన 2018లోనే ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ శాఖలు దాడులు చేశాయనీ, అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందని వివరించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దివాళా తీసిన ఆ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. సాయి మౌర్య ఎస్టేట్స్ కంపెనీ, కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ మధ్య నిధులు చేతులు మారిన విషయాన్ని పన్ను ఎగవేతలను ఐటీ దాడుల సందర్భంగా గుర్తించారని వివరించారు. భూపాల్ ఇన్‌ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ ఖాతాల్లోకి వచ్చాయని గుర్తు చేశారు.
కేఎల్‌ఎస్‌ఆర్, ఏఎస్‌ఎంఈటీ మధ్య గొడవ జరిగితే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాయని అన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్‌సీఎల్‌టీ నిషేధించిందని గుర్తు చేశారు. జడ్జి శరత్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడంతో ఆ కేసు నుంచి ఆయన తప్పుకున్నారని వివరించారు. దివాళా తీసిన కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు దక్కాయని చెప్పారు. జడ్జీని ప్రభావితం చేయడంతోపాటు కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీలోకి రూ.వందల కోట్ల నిధుల రాకపై విచారణ జరపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. సీబీఐ లేదా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఎఫ్‌ఐవో), ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రానికి నోటీసు ఇచ్చిందని వివరించారు.
ఈ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే సిట్ పేరుతో విచారణ డ్రామాలు ఆడారని విమర్శించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐతో విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి కేంద్రంపైన ఒత్తిడి తెచ్చి విచారణ జరిపించాలని సూచించారు. సుప్రీంకోర్టు నోటీసులను పక్కన పెట్టి మరీ రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి, బీజేపీ కాపాడుతున్న మాట నిజం కాకపోతే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ విషయంలో సమగ్ర విచారణ జరిపేదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ తదితరులు పాల్గొన్నారు.



