Thursday, May 29, 2025
Homeప్రధాన వార్తలుసీఎం రేవంత్‌రెడ్డి గారూ..రూ.15 లక్షలకే మీ ఎకరం భూమిస్తరా..!

సీఎం రేవంత్‌రెడ్డి గారూ..రూ.15 లక్షలకే మీ ఎకరం భూమిస్తరా..!

- Advertisement -

– కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములివ్వగలడా..
– ప్రజా పాలనంటే ప్రజలపై, ప్రజా నాయకులపై నిర్బంధాలా
– నిమ్జ్‌ భూ బాధితులకు మార్కెట్‌ ధరపై మూడింతలు అదనంగా ఇవ్వాలి
– ప్రతి ఎకరానికి 120 గజాల ఇంటి స్థలమివ్వాలి
– లేదంటే మా భూముల్లో పారిశ్రామిక వేత్తలే కాదు… సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినా అడుగుపెట్టనీయం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట నిమ్జ్‌ బాధితుల ధర్నా
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘ఎవడబ్బ జాగీరని పేదల భూములకు తక్కువ పరిహారమిచ్చి అప్పనంగా లాక్కుంటున్నరు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న భూముల్ని.. మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల్నీ.. కేవలం రూ.15 లక్షలకే ఎకరం చొప్పున అమ్మగలరా’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. జహీరాబాద్‌ నిమ్జ్‌ రైతులకు 2013 చట్టం ప్రకారం మార్కెట్‌ ధరపై మూడింతలు అదనంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రతి ఎకరానికి 120 గజాల ప్లాట్‌ను ఇవ్వాలని, లేని పక్షంలో పారిశ్రామిక వేత్తలనే కాదు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినా నిమ్జ్‌ భూముల్లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. జహీరాబాద్‌ పరిధిలో నిమ్జ్‌ ప్రాజెక్టు పేరిట వేలాది ఎకరాల భూముల్ని కోల్పోయిన బాధితులతో కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నానుద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. జహీరాబాద్‌ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు పైనే పలుకుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్జ్‌ కోసం తీసుకుంటున్న భూములకు ఎకరానికి కేవలం రూ.15 లక్షల పరిహారమే ఇస్తుందని అన్నారు. పేద రైతుల భూముల్ని తక్కువ పరిహారంతోనే లాక్కోవడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. ప్రజాపాలన జపం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల జహీరాబాద్‌ ప్రాంతంలో పర్యటించి వేలాది ఎకరాల భూముల్ని కోల్పోతున్న రైతుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. పైగా ప్రజలు, రైతుల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) నాయకుల్ని అరెస్టు చేసి నిర్బంధించారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం, దేశంలో పరిపాలించిన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలన్నీ ధనవంతులు, కార్పొరేట్లు, దోపిడీ శక్తుల కోసం పని చేయడం తప్ప పేదల గురించి పట్టించుకున్న చరిత్ర లేదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ ధరపై మూడింతల నష్టపరిహారం చెల్లించాలన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో ఎకరం ధర రూ.50 లక్షలున్నందున నిమ్జ్‌ కోసం సేకరిస్తున్న భూములకు ఎకరానికి కోటిన్నర పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతులకు ప్రతి ఎకరానికి 120 గజాల ప్లాట్‌ కూడా ఇవ్వాలన్నారు. రైతులతో పాటు భూముల్లేని వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు సైతం ఉపాధిని కోల్పోతున్నందున వారందరికీ పునరావాసం కల్పించాలని కోరారు. వీటిని పరిష్కరించకుండా భూముల్లోకి పారిశ్రామికవేత్తలనే కాదు స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినా అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. లగచర్ల, ముచ్చర భూ సేకరణలో మూడింతల పరిహారంతో పాటు అదనంగా ఎకరానికి 120 గజాల ప్లాట్‌ ఇస్తున్న ప్రభుత్వం.. నిమ్జ్‌ బాధితులకు మాత్రం ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. జిల్లా కలెక్టర్‌.. రైతులతో చర్చలు జరిపి న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. సమాజంలో మెజార్జీ ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారని, అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్‌బియ్యం, పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. న్యాయమైన పరిహారం కోసం పోలీసులు లాఠీలు ఝలిపించినా, కేసులు పెట్టి జైల్లో నిర్బంధించినా వెనకడుగేయకుండా ప్రజలంతా ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హక్కులు, అవకాశాలు అడుక్కుంటే వచ్చేవి కావని, పోరాడి సాధించుకోవాలని అన్నారు.

2013 చట్టాన్ని అమలు చేయాలి : ఆర్‌.వెంకట్రాములు
భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. నిమ్జ్‌ భూ బాధితులకు అప్పటి కేసీఆర్‌, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఇద్దరు కూడా న్యాయమైన పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. లగచర్లలో ఇంటి స్థలాలివ్వడంతో పాటు నష్టపరిహారం ఇస్తున్న రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌ నిమ్జ్‌ బాధితులకు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నిమ్జ్‌ రైతుల సమస్యలను చర్చిస్తామని తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. నిమ్జ్‌ రైతులకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పద్ధతిలో రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. జహీరాబాద్‌ సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి బి.రాంచందర్‌ మాట్లాడుతూ.. ఎకరాకు 120 గజాల ప్లాట్‌, మార్కెట్‌ ధరపై మూడింతల పరిహారం, పునరావాసం వంటివి పూర్తి స్థాయిలో అమలు చేస్తే తప్ప ఎవ్వరినీ భూముల్లో అడుగు పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.రాజయ్య, అతిమేల మాణిక్‌, జి.సాయిలు, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, మహిపాల్‌, నాగేశ్వర్‌రావు, విద్యాసాగర్‌, కృష్ణ, నాయకులు కె.రాజయ్య, అశోక్‌, శ్రీనివాస్‌, మహేశ్‌, రాజేశ్‌, వీరస్వామి, నాగభూషణం, చంద్రన్న, దశరథ్‌, కుమార్‌, శివకుమార్‌, దాసు, బాల్‌రాజ్‌, నిమ్జ్‌ బాధితులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -