జూబ్లీహిల్స్ బైపోల్‌లో విజయంపై అగ్రనేత అభినందనలు
సీఎం వెంట మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్, నవీన్ యాదవ్
రాహుల్‌గాంధీకి కొత్త ఎమ్మెల్యేను పరిచయం చేసిన రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి టీమ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. మంత్రివర్గం నుంచి పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంపై సీఎం టీమ్‌కు రాహుల్‌తో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఢిల్లీలో ని 10 జన్‌పథ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతత్వంలోని టీమ్.. రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసింది.
సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ రోహిన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి నవీన్ యాదవ్‌ను సీఎం పరిచయం చేశారు. బీఆర్‌ఎస్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో పార్టీ శ్రేణుల చేసిన కృషిని వివరించారు. పార్టీ విజయం కోసం ప్రచారం మొదలు, బూత్ లెవల్ వరకు కార్యకర్తలే ముందుండి పోరాడారన్నారు. ఘనవిజయానికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ రాహుల్ అభినందించారు. అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఖర్గేతో భేటీ
తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో రేవంత్‌రెడ్డి బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ను ఖర్గే అభినందించారు. ఖర్గేతో కూడా సీఎం బృందం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. అంతకుముందు కె.సి వేణుగోపాల్‌తో కాసేపు సీఎం, రాష్ట్ర ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులను సీఎం ఆయనకు వివరించారు. జూబ్లీహిల్స్ భారీ గెలుపుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు, డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ, మంత్రి వర్గం వంటి పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అనంతరం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్‌కు సంబంధించిన ఒక ప్రయివేటు ప్రొగ్రాంలో సీఎం పాల్గొన్నారు. ఈ రోజు(ఆదివారం) ఉదయం 10 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం తిరిగి హైదరాబాద్ బయలు దేరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
యావత్ తెలంగాణ కాంగ్రెస్‌తో ఉందనే సందేశం ఇచ్చారు: పీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించటం ద్వారా యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో ఉందనే సందేశాన్ని ఓటర్లు ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రెండేండ్ల ప్రజాపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు. ఎంఐఎం మద్దతు, డబ్బులతో కాంగ్రెస్ గెలిచిందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదనీ, ఆ పార్టీ నేతగా కిషన్‌రెడ్డి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కమిట్‌మెంట్ ఉందని మరోసారి గుర్తు చేశారు. బలహీన వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందకుండ బీజేపీ అడ్డంకులు సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ జాబితాలో తన పేరు లేదని చెప్పారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి అవాస్తవం : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
ప్రజా సేవ చేసేందుకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీ వచ్చినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ చెప్పారు. ”నియోజక వర్గ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించారు. వారందరికీ రుణపడి ఉంటా. కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీ వచ్చాను. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లతో కలిసి కాంగ్రెస్ అగ్రనేతల నుంచి ఆశీర్వాదం తీసుకున్నా..” అని ఆయన తెలిపారు. అయితే బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్టు కేటీఆర్ చేస్తోన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.



