పాల్గొన్న పీసీసీ చీఫ్, ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, ఇతర ఎంపీలు పార్లమెంట్‌లో స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్‌లోని ఎంపీల క్యాంటీన్‌లో పాత మిత్రులైన పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను సీఎం పలకరించారు. అనంతరం రాహుల్ గాంధీని ఆయన ఛాంబర్‌లో కలిశారు.
ఆయనను కలిసిన వారిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్‌షెట్కార్, రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని పరిచయం చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు సీఎం, పీసీసీ చీఫ్ సహా ఎంపీలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర బడ్జెట్, గిగ్ వర్కర్ల బిల్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మకర ద్వారం సమీపంలో ప్రియాంక గాంధీని సీఎం కలిశారు. తెలంగాణలో సమర్థవంతమైన పాలన, ఇతర అంశాలపై సీఎంను ప్రియాంక గాంధీ అభినందించారు.
అనంతరం వేం నరేందర్ రెడ్డిని సీఎం పరిచయం చేశారు. అంతకు ముందు తనకు పెద్దల సభకు అవకాశం కల్పించిన రాహుల్, ప్రియాంక గాంధీలకు వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను రాజ్యసభ సెక్రెటరీ విభాగంలో అందజేసినట్టు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనందున ఎంపీగా తాత్కాలిమైన పార్లమెంట్ పాస్‌ను సీపీఐసీ ఇచ్చిందన్నారు. ఏప్రిల్ 10 లేదా ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నట్టు చెప్పారు. అనంతరం సీఎంతో పాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.




