నవతెలంగాణ – ఆలేరు రూరల్
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు..శెభాష్ అంటూ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సీఎంను కలిశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరిత వాతావరణంలో జనగామ మున్సిపాలిటీ కూడా ‘ హస్త ‘ గతమైంది. ఇక్కడ విప్ బీర్ల ఆయిలయ్య ప్రచారం నిర్వహించిన వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. చైర్ పర్సన్ కడకంచి బాలమణి ఎన్నికలో ఆయన కీలక భూమిక పోషించారు. ఇలా సమన్వయంతో ముందుకు సాగితే రానున్న జడ్పీ ఎన్నికల్లో కూడా అద్భుత ఫలితాలు వస్తాయంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని విప్ అయిలయ్య విజ్ఞప్తి చేయగా, సీఎం సానుకూలంగా స్పందించారు.



