మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ చిత్రపటానికి నివాళులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరామర్శించారు. దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా హనుమకొండ జిల్లా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్‌లో మాతృ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాంనాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశస్విని రెడ్డి, కే ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో పీజీఆర్ గార్డెన్‌లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొని కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, నగర మేయర్ సుధారాణి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.