– ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
– 20న సార్వత్రికసమ్మెను జయప్రదం చేయండి : స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్
– టీఎన్జీవో సంఘాలు సర్కారుకు తొత్తులుగా మారాయి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు గర్హనీయమని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ”ప్రభుత్వ ఉద్యోగుల సెమినార్”లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ముందిచ్చిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్, పెండింగ్ బకాయిలు, డీఏల చెల్లింపు విషయంలో డబ్బుల్లేవంటూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయ న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో పబ్లిక్ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా, అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1991లో ప్రధానిగా ఉన్న పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలను ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కొనసాగిస్తు న్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధా నాలను కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహా అందరూ అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ ల్లో ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో అతి పెద్ద ప్రభుత్వం రంగ సంస్థ అయిన రైల్వేలో 6 లక్షల ఖాళీలున్నాయని గుర్తుచేశారు. తెలంగాణతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను నిర్వీర్యం చేశాయని చెప్పారు. కేరళలో మాత్రం ప్రభుత్వ రంగంలో ఖాళీ అయిన పోస్టును అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 90 రోజుల్లోనే భర్తీ చేస్తుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపును తెలంగాణ వ్యాప్తంగా జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులను ఆశల పల్లకి ఎక్కించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఏడాదిన్నర గడు స్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న సమస్యలు రేవంత్ సర్కార్ పాలనలో పరిష్కారం కాకపోగా మరింతగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 20న చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో అన్ని సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పబ్లిక్ సెక్టార్లన్నింట్లో రెగ్యులర్ ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత వారి స్థానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆయిన సింగరేణిలో ఒకప్పుడు 1.2లక్షల మంది ఉద్యోగులుండే వారనీ, ప్రస్తుతం వారి సంఖ్య 40 వేలకు పడిపోయిందని గుర్తు చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు తామే ప్రతినిధులమని చెప్పుకునే కొన్ని సంఘాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు అమ్ముడుపోతున్నాయని విమర్శించారు. టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి మాట్లాడుతూ పెన్షనర్లు దాచుకున్న సొంత డబ్బును పొందడానికి కూడా ఏండ్ల తరబడి ఎదరు చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఫసియొద్దీన్, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ తీరు గర్హనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES