ఎలక్షన్ల ఇండ్లిస్తమన్నరు..గిప్పుడు గద్దెనెక్కి తరిమిగొడుతుండ్రు..
40 ఏండ్ల సందీ గీన్నే ఉన్నం
మా తాతలు ఈడనే చచ్చిండ్రు..మేం ఈన్నే చస్తం
గుడిసెలు కూలగొడితే..మళ్లీ ఏసుకుంటాం
నవతెలంగాణతో బసవతారకనగర్ గుడిసెవాసులు
బాధితులకు అండగా సీపీఐ(ఎం)
ఇండ్ల జాగాల కోసం కొనసాగుతున్న పోరాటం
”మా తాత, నాయనమ్మ, అవ్వ గీన్నే బతికిండ్రు.. గిన్నే చచ్చిండ్రు.. గాళ్ల సమాధులు కూడా ఈన్నే ఉన్నరు. నేనూ ఈడ్నే పుట్టి పెరిగిన. నాకు ఇద్దరు పిల్లలు. మా అయ్య ఇచ్చిన గుడిసెలోనే బతుకుతున్న. రాయి పని చేసి బతుకుతున్నం. మాపై ఒక్కసారిగా రాబందుల గుంపులా గూండాలు దాడి జేసిండ్రు. మా గుడిసెలు కూలగొట్టిండ్రు. గీదేంది అని అడిగితే.. గీ భూమి మీది కాదు.. ప్రయివేటోళ్లది.. అంటూ బెదిరిస్తుండ్రు. ఏడ బోతం. ఎట్ల బతుకుతాం…ఈడ్నే మళ్లీ గుడిసె వేసుకుంటం. గిడ్నే ఉంటం. గీ జాగాలు ఇడిసేదే లేదు. ఈడికెంచి కదిలేదీ లేదు” అంటూ బసవతారకనగర్ వాసులు ఇండ్ల జాగాల కోసం గొంతెత్తి గర్జిస్తున్నారు.
సైదులు
”నాకు 2010లో పెండ్లయింది. ముగ్గురు పిల్లలు. ఇండ్లలో పని చేసుకుని బతుకుతున్న. నెల కిందనే రూ.3 లక్షలు అప్పు జేసి చిన్నగా ఇల్లు కట్టుకున్నా. ఇంతలోనే.. రౌడీలు మాపై దాడి చేసి, ఇల్లు మొత్తం కూలగొట్టిండ్రు. ఎంత వేడుకున్నా వినలే. ఇంటికి తెచ్చిన అప్పెట్ట కట్టేది. మళ్లీ ఇల్లెట్ట కట్టేది. ప్రభుత్వమే మాకు ఇండ్లు కట్టించి ఇయ్యాలే. మా ఇండ్లకు ఇంటి నెంబర్, కరెంట్, నల్లా బిల్లులు అన్నీ ఉన్నయి. ఇక్కడే ఆధార్, రేషన్ కార్డులూ ఉన్నయి. మేం ఇడికెళ్లి పోయేదే లేదు.’ అని వసంత అనే మహిళ ఆవేదనగా చెప్పుకొచ్చింది. ఆ కాలనీలో ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే. ‘నవతెలంగాణ’ ప్రతినిధి బసవతారకనగర్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడి కాలనీవాసులు తమ బాధల్ని చెప్పుకొని, కన్నీటి పర్యంతమయ్యారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి రెవెన్యూ పరిధిలోని 36, 37 సర్వే నెంబర్లలో ప్రభుత్వ రికార్డు 1954-55 సేత్వారు ప్రకారం సుమారు 864 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. ఇందులో కొంత భూమిని అప్పటి ప్రభుత్వాలు కొన్ని సంస్థలకు అప్పగించాయి. కొంత కబ్జాకు గురైంది. ఇక్కడే దాదాపు 300 కుటుంబాలు 40 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయి. వీరంతా గతంలో కంకర క్రషర్లలో పనిచేసేవారు. సామాజికంగా వడ్డెరలు, దళితులు, లంబాడీలు ఉన్నారు. కాలక్రమంలో దీన్ని గౌలిదొడ్డి గ్రామంలోని 11వ వార్డుగా గుర్తించారు. అప్పటి తెలుగుదేశంపార్టీ నాయకులు ఈ కాలనీకి బసవతారకనగర్‌గా నామకరణం చేశారు. వీరందరికీ గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు మంజూరు చేశాయి. ఇంటి నెంబర్, నల్లా, కరెంట్ కలెక్షన్లు కూడా ఇచ్చాయి.
భూమిని కాజేసే కుట్ర
ఈ భూమిపై ఇప్పుడు పెద్దల కన్ను పడింది. సీటీ విస్తరించడంతో భూమి విలువ పెరిగింది. దీనితో ఈ భూమిని కాజేసేందుకు కుట్రలకు తెరలేపారు. ఈ భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుగా గుడిసెవాసులను వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. 2021లో గుడిసెలపై దాడులు చేసి కూల్చివేసింది. ఇక్కడే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మబలికింది. అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీవో లబ్దిదారుల జాబితా కూడా తయారు చేశారు. కానీ ఇండ్లు ఇవ్వలేదు. దీనితో పేదలు మళ్లీ ఇక్కడే గుడిసెలు వేసుకున్నారు.
సీఎం సాక్ష్యం
బీఆర్‌ఎస్ హయాంలో ఇక్కడి గుడిసెవాసులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పేదలను పరామర్శించారు. గుడిసెల కూల్చివేతపై అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. పేదల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గుడిసెల్ని తిరిగి నిర్మించుకునేందుకు బాధితులకు ఆర్థిక సాయం, వంట పాత్రలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇండ్ల పట్టాలతోపాటు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా మళ్లీ దాడులు
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చినా బసవతారకనగర్ ప్రజల సమస్య తీరలేదు. ఇటీవల మళ్లీ ప్రయివేట్ వ్యక్తులు పేదలపై విరుచుకుపడ్డారు. ఈ జాగాలు ప్రయివేట్ వాళ్లవనీ, కోర్టు కూడా వారికే అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ ఇక్కడి పేదల్ని భయభ్రాంతులకు గురిచేశారు. జాగాలను ఖాళీ చేయాలంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. గుడి సెలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ దుశ్చర్య వెనుక స్థానిక నేతల హస్తం ఉన్నదని గుడిసెవాసులు చెప్తున్నారు.
బాధితులకు అండగా సీపీఐ(ఎం)
బసవతారకనగర్ వాసులకు సీపీఐ(ఎం) అండగా నిలిచింది. పేదలపై దాడి చేయడం, గుడిసెలు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించింది. కాలనీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రాష్ట్ర, జిల్లా నాయకులు పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. స్థానిక నాయకత్వం ప్రతిరోజూ అండగా నిలుస్తోంది. కూలిన చోటే మళ్లీ దగ్గరుండి గుడిసెలు వేయిస్తోంది. ఈ విషయాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా, మహిళా సంఘాలు సైతం ఇక్కడి పేదలకు అండగా నిలిచాయి. బసవతారకనగర్ పేదలకు ఇండ్ల పట్టాలతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
సీఎం సాబ్..మీరే సాక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES