భూదాన్ భూముల్లో పక్కా ఇండ్లు కట్టివ్వాలి
పేదలకు సరైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలి: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో 12 ఏండ్లుగా నివాసముంటున్న 700 మంది పేదల ఇండ్ల కూల్చివేతపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలనీ, భూదాన్ భూముల్లోనే వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు డిమాండ్ చేశారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు సరైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. 2014లోనే భూదాన్ బోర్డు చైర్మెన్ రాజేందర్‌రెడ్డి అక్కడి పేదలకు ఇంటి స్థలం కోసం వంద గజాల చొప్పున మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూముల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి పేదల ఇండ్లను కూల్చే దుశ్చర్యకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు.
అవి విలువైన భూములనే పేరుతో పేదలను అక్కడి నుండి తొలగించటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని సందర్శించగా అది యుద్ధంలోనో, భారీ భూకంపంలోనో నాశనమైనట్టుగా బీభత్సంగా పరిస్థితి కనిపించిందని తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తూనే మీరు కూడా పేదల పట్ల అమానుషంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించిన అంబేద్కర్ భవన్, టీటీడీసీలలో సరైన వసతి, భోజన ఏర్పాట్లు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఎత్తి చూపారు. అక్కడ ఉన్నవారు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇండ్ల కూల్చివేతపై సీఎం జోక్యం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



