Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంఉద్యమ స్ఫూర్తితో సీఎం మాట్లాడాలి

ఉద్యమ స్ఫూర్తితో సీఎం మాట్లాడాలి

- Advertisement -

– ప్రజానీకం ముందు ఉద్యోగులను దోషులుగా చూపడం సరికాదు:
– తెలంగాణ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ
నవతెలంగాణ – బంజారాహిల్స్‌

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఉద్యోగులను తెలంగాణ ప్రజానీకం ముందు సీఎం రేవంత్‌రెడ్డి దోషులుగా చూపించడంపై తెలంగాణ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగంగా చెబుతూ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారని, ముఖ్యమంత్రి ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడాలని సూచించింది. తెలంగాణ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. గత ప్రభుత్వంలో రూ.14 వేల కోట్ల ఆదాయం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను కించపరచడం సరికాదన్నారు. నేడు ఆ ఆదాయం రూ.18 వేల కోట్లకు పెరిగినా.. ఉద్యోగులను బూచిగా చూపెడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయలేనని సీఎం బహిరంగ ప్రకటన చేసి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని విమర్శించారు. శాసనమండలి మాజీ స్పీకర్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యోగులం.. నేడు రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని సమిష్టిగా ఒకే వేదికపైకి వచ్చి పోరాడే దిశగా తెలంగాణ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీగా ఏర్పడ్డామని తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. దేవిప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి ఉద్యోగులు ఎంత కీలకమో చరిత్ర తిరగేస్తే తెలుస్తుందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా బహిరంగంగా కాకుండా ఉద్యోగులతో, మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు సుమిత్ర, విజయలక్ష్మి, విట్టల్‌, భుజంగరావు, హేమద్‌, రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -