Monday, February 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసీఎం సార్‌..మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి

సీఎం సార్‌..మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి

- Advertisement -

ఆర్థిక సమస్యలే శాపంగా మారిన వైనం
ఫీజు కట్టలేదని పరీక్షకు దూరం చేయడం న్యాయమేనా?
కన్నీటి పర్యంతమవుతున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థులు
పరీక్షల ప్రిపరేషన్‌లోనూ అధికారుల వైఫల్యం

నవతెలంగాణ-సిటీ బ్యూరో
చేతిలో హాల్‌ టికెట్‌ పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థులు.. కండ్లలో నీళ్లతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చదువుకునే ఆసక్తి ఉన్నా, చేతిలో చిల్లిగవ్వ లేక సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన పాపానికి, తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఇది ప్రయివేటు కార్పొరేట్‌ కాలేజీల విద్యార్థుల సమస్య కాదు.. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ధీనగాధ. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరే వారిలో అత్యధికులు నిరుపేదలే.

రోజువారీ కూలీలు, వాచ్‌మెన్‌, చిన్నకారు రైతుల పిల్లలే ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రుల ఉపాధి లేకపోవడం వంటి కారణాల వల్ల నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ”ఫీజు కట్టకూడదని కాదు.. మా దగ్గర ఆ సమయానికి డబ్బుల్లేక కట్టలేకపోయాం” అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలా ఉండగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పరీక్షలకు అధ్యాపకులను విధులు వేసే విషయంలోనూ నిర్లక్ష్యం ఉంది. సీఎం చూస్తున్న శాఖలోనే అధికారుల లోపాలు కనపడటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

300 మంది భవిష్యత్తు అగమ్యగోచరం..
కేవలం ఆర్థిక సమస్యల కారణంగా సుమారు 300పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయలేకపోతున్నారని సమాచారం. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఇప్పుడు వీరికి పరీక్ష రాసే అవకాశం కల్పించకపోతే, ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వృధా అవుతుంది. ఇది వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేయడమే కాకుండా, చదువుపై ఆసక్తిని చంపివేసే ప్రమాదం ఉంది. చాలా మంది విద్యార్థులు ఈ ఒక్క సంవత్సరం కోల్పోతే, ఇక చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

మానవతా దృక్పథంతో ఆలోచించండి
నిబంధనలు ఉండాల్సిందే, కానీ అవి నిరుపేద విద్యార్థుల పాలిట శాపంగా మార కూడదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అంటున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు అధి కారులు, విద్యాశాఖ మంత్రి స్పందించి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని వారు వేడుకుంటున్నారు. తత్కాల్‌ పద్ధతిలోనైనా లేదా ప్రత్యేక అనుమతితోనైనా ఫీజు చెల్లించుకుని, పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

విద్యార్థుల అభ్యర్థన ఇదే..
”మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా పేదరికాన్ని చూసి మమ్మల్ని శిక్షించకండి. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. మా విలువైన సంవత్సరం వృధా కాకుండా చూడండి” అని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఈ 300కుపైగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందా? లేదా నిబంధనల పేరుతో వారిని ఇంటికి పంపిస్తుందా? అనేది వేచి చూడాలి.

ఆర్థిక పరిస్థితుల కారణంగా సకాలంలో ఫీజు చెల్లించలేకపోయాం
ఫీజు చెల్లించకపోవడంతో నాకు హాల్‌ టికెట్‌ రాలేదు. పరీక్షల సమయం దగ్గరపడు తుండటంతో హాల్‌ టికెట్‌ రాక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. లింక్‌ ఓపెన్‌ కావడం లేదు. ఇప్పుడు ఏం చేయలేమని సిబ్బంది చేతులెత్తేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. -జి. విమల, బైపీసీ, ప్రథమ సంవత్సరం, ఆర్‌ఎల్‌డీ జూనియర్‌ కాలేజ్‌ సికింద్రాబాద్‌

అనారోగ్య కారణాలతో ఫీజు కట్టలేకపోయాను
అనారోగ్య కారణాల వల్ల మా సొంతూరుకు వెళ్లాను. సకాలంలో పరీక్ష ఫీజు కట్టలేకపోయాను. ఫీజు కట్టే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా.
-కృషినేష్‌, ఎంఈసీ, ఫస్ట్‌ ఇయర్‌, ఆర్‌ఎల్‌డీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మారేడుపల్లి, సికింద్రాబాద్‌

పేద విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించండి
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతివ్వాలి. పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం కల్పించాలి. తక్షణమే ప్రభుత్వ ఉన్నత అధి కారులు స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. -కేపీ శోభన్‌ బాబు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -