Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయం15న 'పుష్కరాలు'.. హాజరు కానున్న సీఎం

15న ‘పుష్కరాలు’.. హాజరు కానున్న సీఎం

- Advertisement -

– కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు : కలెక్టర్‌ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-కాళేశ్వరం

ఈ నెల 15న అట్టహాసంగా సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరై పుష్కరాలను ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. సోమవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాల పనులను జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరేతో కలిసి పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక త్రివేణి సంగమం, దేశంలో రెండో ప్రాంతమైన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతోందని అన్నారు. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించే త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రతిరోజూ కాశీ పీఠాధిపతులచే నది హారతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
ఇప్పటికే ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ 15వ తేదీన సరస్వతీ మాత విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించడంతో పాటు గోదావరి హారతి, త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అందుకనుగుణంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలు నిర్వహించనున్న 12 రోజుల పాటు ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేసినట్టు చెప్పారు. జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -