Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏప్రిల్‌ 6న పిప్పిరిలో సీఎం బహిరంగ సభ

ఏప్రిల్‌ 6న పిప్పిరిలో సీఎం బహిరంగ సభ

- Advertisement -

పీపుల్స్‌ మార్చ్‌కు మూడేండ్లయిన సందర్భంగా నిర్వహణ
హామీల అమలు పత్రాలను అందివ్వనున్న సీఎం రేవంత్‌రెడ్డి : సభ ఏర్పాట్లపై సమీక్షించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్‌ మార్చ్‌’కు మూడేండ్లు పూర్తయిన సందర్భంగా, 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ఏప్రిల్‌ ఆరో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు పత్రాలను సీఎం చేతులమీదుగా అందజేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాల జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.

ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..మూడేండ్ల కిందట తాను చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పిప్పిరి గ్రామం నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అందజేస్తామన్నారు. ఏప్రిల్‌ 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారనీ, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి గ్రామంలో జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా నిషేధిత జాబితాలో చేర్చిందని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా ధరణిని రద్దు చేసి, పారదర్శకమైన వ్యవస్థను తెస్తామని ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అసైన్డ్‌ భూముల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

జలయజ్ఞంలో అడ వద్ద ప్రారంభించిన కొమ్రంభీమ్‌ ప్రాజెక్టుకు సంబంధించి కాల్వలు పూర్తికాకపోవడం రైతులకు నీళ్లు అందడం లేదనీ, వెంటనే ఆ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను పూర్తిచేయాని అధికారులను ఆదేశించారు. అలాగే చికుమాను, పులిమడుగు, కుప్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా సాగును ప్రోత్సహించాలని సూచించారు. గిరిజన మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా వడ్డీ లేని రుణాలు అందిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మెస్రం వంశీయుల కోరిక మేరకు కేస్లాపూర్‌ నాగోబా ఆలయ అభివృద్ధి కోసం తాము అధికారంలోకి రాగానే నిధులు కేటాయించామని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలనీ, అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. జూన్‌ రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇండ్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినా వాటిని స్వీకరించాలనీ, అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారులు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, శాసనసభ్యులు సుదర్శన్‌రెడ్డిలు.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని బహిరంగసభ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి మంజూరు పత్రాలను అందించే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌ రావు, వెడ్మ బొజ్జు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ప్లానింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గౌరవ ఉప్పల్‌, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ యోగితారాణా, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజార్షిషా, ఆసిఫాబాద్‌ కొమరం భీం జిల్లా కలెక్టర్‌ హరిత, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -