2024-25లో 690.06 లక్షల మెట్రిక్ టన్నులు
2025-26లో 580 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిన వైనం
ఏడాదిలో 16 శాతం తగ్గుదల
కొత్తబావులు లేవు.. వెంటాడుతున్న నిర్వహణా లోపం
ఇదీ సింగరేణి దుస్థితి
సంస్థలో పెరిగిన అవినీతిపై కాగ్ అక్షింతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. గత మూడేండ్లలో 120లక్షల టన్నుల ఉత్పత్తి పడిపోయింది. 2024-25లో 690.06 లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా.. 2025-26 మార్చి నాటికి (తుది లెక్కల ప్రకారం) 580 లక్షల టన్నులకు ఉత్పత్తి మించకపోవటం గమనార్హం. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 16 శాతం ఉత్పత్తి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం వల్ల ఆ సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు దక్కకుండా పోయాయి. దీనికితోడు నిర్వహణా లోపాలు, అవినీతి వెంటాడుతున్నాయి. వీటికి వర్షాలు కూడా తోడయ్యాయి. వెరసి… బొగ్గు ఉత్పత్తి నానాటికీ తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నష్ట నివారణ చర్యలు తెలంగాణ డిస్కంలు చేపట్టాల్సిన యాజమాన్యం ఆ ప్రయత్నాలేవీ చేయటం లేదు. సంస్థకు ఆసరా అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.
కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణికి నేరుగా ఒక్క బొగ్గు బ్లాకును కూడా కేటాయించకపోవటం గమనార్హం. 2015లో సంస్థ గుర్తించిన 15 కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలంటూ సింగరేణి కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. గతంలోలా నేరుగా కేటాయించడం కుదరదని, అవసరముంటే వేలంలో పాల్గొనాలని కేంద్రం తేల్చి చెప్పింది. సింగరేణి దరఖాస్తు చేసుకున్న ఖమ్మం జిల్లా కోయగూడెం-3, కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి ఓసీపీ-3, మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి, కళ్యాణఖని-6 బ్లాక్‌లకు వేలం నిర్వహించి ప్రయివేటు కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మాతోపాటు మరో మూడు సంస్థలు ఈ బ్లాకులను దక్కించుకున్నాయి. సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధి (కోల్‌బెల్ట్ ఏరియా)లో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. అందులో సింగరేణికి 2,997 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వేందుకు అనుమతులున్నాయి.
ఇప్పటి వరకు దాదాపు 1,500 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా మరో 1,497 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అనుమతి పొందిన ప్రాంతంలో మిగిలిన బొగ్గును తవ్వి తీసేందుకు తాజా లెక్కల ప్రకారం 29 అండర్ గ్రౌండ్, 19 ఓపెన్ కాస్ట్.. మొత్తం 47 బొగ్గు బావులను సంస్థ నిర్వహిస్తోంది. అయితే 2030 వరకు ఇందులో సగం బావుల్లో బొగ్గు నిల్వలు నిండుకోనుండటంతో అవి మూత పడే అవకాశముంది. రాబోయే ఐదేండ్లలో సింగరేణి విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ఏరియాలో దాదాపు 25 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాలని నిర్ణయించింది. నేరుగా తమకే కేటాయించాలని సింగరేణి కోరిన 15 బ్లాకులతోపాటు మరో 10 బ్లాకులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేయనుంది. సింగరేణి సంస్థ సీరియస్‌గా వేలంలో పాల్గొన్నా ఒకటి రెండు కూడా దక్కవని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలతోనే కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి అందుబాటులోకి రావటం లేదు.
వివాదంలో నైనీ
సింగరేణి గత పన్నెండేండ్లలో కేంద్రం నిర్వహించిన వేలంలో దక్కించుకున్నది ఒకే ఒక్క బొగ్గు బ్లాక్ (ఒడిశాలోని నైనీ) మాత్రమే. కేంద్రం వద్ద తొమ్మిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బ్లాక్ అన్ని అడ్డంకులను అధిగమించి 2025లో ఉత్పత్తిని ప్రారంభించింది. గని అభివృద్ధి, నిర్వహణ కోసం జరిగిన టెండర్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో వాటిని రద్దు చేసింది. ఈ వివాదంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించింది. తాను నియమించిన సాంకేతిక కమిటీ నివేదికను ఇప్పటి వరకు కేంద్రం బహిర్గతం చేయలేదు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్పందించలేదు.
పెరిగిన అవినీతి
సింగరేణి సంస్థలో గత కొన్నేండ్లుగా అవినీతి పెరిగింది. డీజిల్ నిర్వహణ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు అవకతవకలు జరుగుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2025 నివేదికలో పేర్కొంది. దీనికి డీజిల్ వినియోగంలో లోపాలు, రవాణా సమస్యలు, కాంట్రాక్టర్ల ఒప్పంద ఉల్లంఘనలు కారణమని పేర్కొంది. ఒక్క ఏడాదిలోనే రూ.251 కోట్ల డీజిల్ పక్కదారి పట్టిందని తేల్చింది. సంస్థతో వివిధ పనుల కోసం ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల రూ. 74.19 కోట్లు, అలాగే కోల్ రవాణాలో ప్రణాళిక సరిగా లేకపోవడం, ధరల లోపాల వల్ల రూ.1,078 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది.
సింగరేణి సంస్థలో 2025లో దాదాపు రూ.1,400 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అలాగే సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రోజురోజుకు పేరుకుపోతున్నాయని తెలిపింది. 2024-25లో సింగరేణి డిస్కంలపై క్లైయిమ్ చేసిన రూ.2,234.35 కోట్ల లేట్ పెనాల్టీ సర్‌చార్జ్ (ఎల్పీఎస్)ను ఆడిట్లో వెల్లడించలేదని తప్పుపట్టింది. ల్యాండ్ అక్వేషన్, పర్యావరణ నిబంధనలు పాటించడం తదితర అనేక అంశాల్లో అధికారుల అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.




