– ఇంటర్ బోర్డును సందర్శించిన నేపాల్, భూటాన్ ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ఇంటర్ బోర్డు డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థపై కోబ్సే సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మూడు రోజులపాటు జరిగే కోబ్సే సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల్లోని, నేపాల్, భూటాన్ దేశాల్లోని విద్యా బోర్డుల ప్రతినిధులు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న డిజిటల్ పర్యవేక్షణ, పారదర్శకత చర్యలను వారు పరిశీలించారు. స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. దాని ద్వారా అమలు చేస్తున్న విధానాలను ఇంటర్ బోర్డు అధికారులు వివరించారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలను సీసీటీవీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేశామని చెప్పారు. విద్యార్థుల హాజరును ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తున్నామని అన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌ఆర్‌ఎంఎస్) ద్వారా ఉద్యోగుల సేవలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని వివరించారు. తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు, పరీక్షా షెడ్యూల్, హాల్‌టికెట్లు, వాట్సాప్, మొబైల్ సందేశాల ద్వారా చేరవేస్తున్నామని చెప్పారు. పరీక్షలు, ప్రాక్టికల్‌లు కూడా సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహించి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, వేగవంతమైన చర్యలు సాధ్యమవుతున్న తీరును ప్రతినిధులు ప్రశంసించారు. ఇవి విద్యా పరిపాలనలో పారదర్శకత, బాధ్యతా నిబద్ధత, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తున్నాయని బోర్డు అధికారులు వివరించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు నమూనా దేశంలోని ఇతర రాష్ట్రాలు, పొరుగు దేశాలు కూడా అనుసరించదగినదని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మెన్ మహాశ్రం శర్మ, నేపాల్ సభ్యకార్యదర్శి జంగా బహదూర్ ఆర్యల్, జమ్మూకాశ్మీర్ బోర్డు అధికారి యాసిర్ హమీద్ సిర్మల్, అరిఫ్ జాన్, జామియా ఉర్దూ అలీగడ్ నుంచి షమూన్ రజా నక్వీ, భూటాన్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ నుంచి తుక్టియా టెనిన్, నార్ బహదూర్ రైకా, బెంగుళూరు పీయూ బోర్డు నుంచి పి రేఖారాణి, ఏపీ ఇంటర్ బోర్డు నుంచి కృష్ణకాంత్, ఎన్‌సీఈఆర్టీ పరఖ్ నుంచి అమన్‌దీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ తమ రాష్ట్రాలు, దేశాల్లో బోర్డుల్లో కూడా ఇలాంటి సాంకేతిక వ్యవస్థలను అమలు చేయాలని వారు ఆకాంక్షించారు.
డిజిటల్ విద్య పర్యవేక్షణ వ్యవస్థపై కోబ్సే సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



