– బాలానగర్‌లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
నవతెలంగాణ – బాలానగర్
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్, కుష్ గంజాయిని సోమవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను అమ్ముతున్న కరణ్ పరమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ కిషన్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టినట్టు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 19.36 గ్రాముల కొకైన్‌తో పాటు 6.77 గ్రాముల కుష్ గంజాయి, రూ.55 వేలు, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కరణ్ పరమార్ గోవాకు చెందిన సంతోష్ జావిద్ నుంచి కొరియర్ ద్వారా ఈ మత్తు పదార్థాలను తెప్పించుకుని నగరంలో విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తెలిసినా ఎక్సైజ్ సిబ్బందికి తెలపాలని సూచించారు. డ్రగ్స్ అమ్మినా, వాడినా చట్టరీత్యా నేరమని చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ మొత్తం రూ.4 లక్షల 30 వేలు ఉంటుందని అంచనా వేశారు.
కొకైన్, కుష్ గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -