Saturday, March 21, 2026
E-PAPER
Homeకథగానుగ నూనె దుకాణం

గానుగ నూనె దుకాణం

- Advertisement -

మా ఊరు మండల కేంద్రానికి ఆనుకుని NH -65 హైవేకు దగ్గరలో ఉండడం వల్ల మా ఊళ్లో పెద్ద పెద్ద కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్లు చాలానే ఉన్నాయి. షాపుల్లో ‘నూనె’ ప్యాకెట్‌ లలోనూ విడిగానూ ఎలా కావాలంటే అలా ‘గానుగ నూనె’ కంటే చవక ధరకే నూనె దొరుకుతుంది. కానీ గానుగలో నూనె గింజలు వేసి మన కళ్ళముందే ఆడించి ఆ వచ్చిన నూనెను వడగట్టి ఇచ్చే నికార్సైన స్వచ్చమైన మంచి నూనె దుకాణం ఒకటే ఉంది. నూనె గింజల ధరను బట్టి నూనె ధరను లెక్క కట్టాలి. అలా అయితే గానుగ నూనె ధర మిగతా షాపుల్లో దొరికే ప్యాకెట్‌ నూనె ధర కంటే చాలా ఎక్కువ. కానీ… ఈమధ్య కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. ప్యాకెట్‌లో ఉండే నూనెలో వేరే ఏదో ఆయిల్‌ కలుపుతారు అందుకే మన కంటికి నీళ్ళ లాగా కనిపిస్తుంది. అందులో సారం ఉండదు.

అందుకే మనమే నూనె గింజలు తీసుకుని వెళ్ళి మన కళ్ళముందు గానుగలో పోసి నూనె తీసి ఇచ్చే ఆ గాండ్ల వారి నూనె దుకాణానికి ఈమధ్య గిరాకీ బాగా పెరిగింది. అందుకే తెల్లవారి లేచింది మొదలు రాత్రి 9 గంటల వరకు ఎప్పుడూ ఆ నూనె దుకాణం రద్దీగానే ఉంటుంది. అప్పుడు మా కాలేజీకి సెలవులు. అమ్మకు చేదోడవుదామని నా చేతి ఖర్చులు కోసమైనా పనికొస్తాయని, నేను ఈమధ్యనే ఆ నూనె దుకాణంలో పనికి చేరాను. దుకాణం యజమాని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నూనె గానుగ పట్టించుకోవడానికి వచ్చేవాళ్ళతో జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళు ఎంత డబ్బున్న పెద్దవాళ్ళైనా సరే చేతివాటం చూపిస్తూనే ఉంటారు. అందుకే దుకాణానికి వచ్చి వెళ్ళే వాళ్ళపై ఓ కన్నేసి ఉంచాలి అన్నాడు మా దుకాణం యజమాని.

నేను సరేనని తలూపి ఆరోజు నుండి ఆ దుకాణంలోకి పనికి వెళ్తున్నాను.

నేను ప్రతిరోజూ మా యజమాని కుటుంబాన్ని గమనిస్తూనే ఉంటాను. మా దుకాణం యజమాని అతని భార్య… ఇద్దరు పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటిపని, వంటపని ముగించుకుని పిల్లలకు లంచ్‌బాక్స్‌లు పెట్టి స్కూల్‌కు పంపించి పిల్లలు వెళ్ళిపోయాక నూనె దుకాణం తలుపు తీస్తారు. దుకాణాన్ని శుభ్రంగా ఊడ్చి దేవుడి ముందు నూనెదీపం వెలిగించి గానుగ మిషన్‌కు పూజచేసి బొట్లు పెట్టి, దుకాణం అంతా ధూపం వేసి దేవునికి మొక్కి అప్పుడు స్విచ్‌ వేసి గానుగ ఆడించడం మొదలు పెడతారు. పని మొదలు పెట్టినప్పటినుండీ రాత్రి తొమ్మిది గంటల వరకు కరెంట్‌ పోతే తప్ప మిషన్‌ ఆగదు.

నూనె గింజలన్నీ ఆరబెట్టి కాపలాగా ఉంటూ నూనె కొనడానికి వచ్చే వాళ్ళకు తూకంవేసి నూనె అమ్మే పని నాకు అప్పజెప్పారు.

ఆరోజు షాపు తెరిచే సమయానికే కొందరు వేరుశనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి, కుసుమలు… ఇలా నూనె గింజలు తెచ్చి వరుసగా షాపు ముందు పెట్టుకుని నిలబడి ఉన్నారు.
షట్టర్‌ తెరిచి లోపలకి వెళ్లి సర్దుకునే సరికే వరుసగా నిలబడి నేనుముందొచ్చానంటే నేను ముందొచ్చానని నూనె గింజలు పట్టించుకునేందుకు వచ్చినవారు గొడవ పడుతున్నారు. దుకాణం యజమాని వాళ్ళను సముదాయించి ఎవరిదో ఒకరిది వేస్తేనే కదా! పని ముందుకు వెళ్తుంది. ఈ వేరుశెనగ గుళ్ళు ముందుగా పోద్దాం, తక్కువ సమయంలో అయిపోతుంది. దీని వెంబడే మీ కుసుమలు పోస్తాను అని నచ్చజెప్పి శాంత పరిచి వేరుశెనగలను గానుగలో పోసాడు.

అంతసేపు గొడవగొడవగా ఉన్న దుకాణం మా యజమాని నచ్చజెప్పే సరికి ప్రశాంతంగా మారిపోయింది.

‘నువ్వులు 10 కిలోలు ఉన్నాయి. ఎంత అవుతుంది?’ అని అడిగాడు ఒకతను కేక వేసినట్లు అనిపించే గొంతుతో. అటు వైపు వెళ్లి చూసాను. నేను అక్కడ చేరి సరిగ్గా ఎనిమిది రోజులు అవుతుంది. చేరిన మొదటిరోజే మా యజమాని నాకు కొన్ని సూచనలు చేసి అక్కడ పని చేయాలంటే ఈ నియమాలు పాటించాలి అని చెప్పాడు. ‘కస్టమర్లు దేవుళ్ళతో సమానం. వాళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు, ఓపికతో సమాధానం చెప్పాలి’ అన్నాడు. నేను తలూపాను. ”కొందరు కస్టమర్లు నూనె గింజలు గానుగ ఆడించాక.. తక్కువ నూనె వచ్చిందని నూనెతో పాటు పిండి కూడా పట్టుకెళ్ళి పోతాం.. మాకు గేదెలు ఉన్నాయని గొడవ చేస్తారు. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు ముందుగానే వాళ్ళతో చెప్పు నూనెగింజలు ఒక కిలోకి గానుగ ఆడించడానికి యాభై రూపాయలు. గానుగ పిండి మాకే ఇస్తే ఆ 50 రూపాయలు కూడా ఇవ్వడం అవసరంలేదు. గింజలను బట్టి నూనె వస్తుంది. అన్ని గింజలకు ఒకేలా నూనె రాదు.

అలా ఒప్పుకుంటేనే గానుగలో గింజలు వేస్తాను లేకపోతే లేదని చెప్పు” అని మా యజమాని నాకు చెప్పాడు. కొందరు వాళ్ళ నూనెతో పాటు పక్కకు ఇంతకు ముందు పోసిన గానుగ పిండిని కూడా తీసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్లకు మనం పడుతున్న కష్టం మీద ఏమాత్రం గౌరవం ఉండదు. మనం కడుపు కట్టుకొని పొద్దంతా కష్టపడితే వచ్చే ఆదాయం ఎవరైనా నాలుగు గానుగ పిండి కరళ్ళను తీసుకొని వెళ్ళిపోతే ఆదాయం రాకపోగా మిగిలేది కూడా ఏమీ ఉండదు. అందుకే ఎప్పుడూ నేను చుట్టూ పరిశీలించి చూస్తూ ఉంటాను. చాలాసేపటి నుండి నేను గమనిస్తున్నాను. దుకాణం బయట ఒక పెద్దావిడ చేతిలో మూటతో కూర్చొని ఉంది. ఆయాసం అనుకుంటా కొంగు నడుముకు చుట్టుకుని రేగిపోయిన జుట్టును సవరించుకుని ఇటువైపే చూస్తుంది. ఎందుకు అక్కడే కూర్చుంది. లోపలికి ఎందుకు రావట్లేదు! అనుమానంగా చూసి మెల్లగా బయటకు అడుగులు వేసాను. నన్ను చూసి ఆమె గాబరా పడుతుంది. ఆమెనలా చూసేసరికి నాకు ఆమెపై అనుమానం మరింత పెరిగింది.

‘బయట ఆరబోసిన వేరుశనగ గుండ్లను మూటలో కట్టుకుందా?’
‘గానుగ పిండిని సంచిలో నింపుకుందా?’ ఏమైనా కానీ చివాలున లేచి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి ”ఏం కావాలి అవ్వా?” అన్నాను.
”ఏమీలేదు” అంది ముభావంగా! ”మరి ఎందుకు ఇక్కడ కూర్చున్నావ్‌?” ప్రశ్నించాను.
ఆమె తలదించుకుంది ఏమీ మాట్లాడలేదు.
”మాటలు రావా ఓ అవ్వా ఏం కావాలి? నీవు మాట్లాడకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు! ఆ మూటలో ఏముంది?” అన్నాను.
మూటపై చెయ్యి పెట్టి కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ మూట విప్పి చూపించింది.
అందులో వేపగింజలున్నాయి.
”ఎందుకు తెచ్చినవ్‌ అవ్వా?” అన్నాను.

”ఈ వేప గింజలు నూనె దుకాణంలో అమ్మి నువ్వులనూనె పోయించుకుని పోదామని వచ్చిన” అన్నది .
నేను ఆశ్చర్యపోయాను. ”వేప గింజలు పది రూపాయలకు కిలో. ఇవి ఓ ఐదు కిలోలు ఉండొచ్చు. యాబై రూపాయలు వస్తాయి. నువ్వులనూనె ఎంతనో తెలుసా? 500/- రూపాయలకు కిలో ఎట్లొస్తాయనుకున్నావ్‌!” అన్నాను.
”అందుకే బిడ్డా ఇక్కడనే కూర్చున్నా ‘ అంది ముసలవ్వ.
అవునూ… నువ్వులనూనెనే ఎందుకు కావాలే అన్నాను.
”నేను ఒంటరి దాన్ని. నా బిడ్డ కాన్పుకు నా ఇంటికి వచ్చింది. నిన్ననే కాన్పు అయ్యింది. కొడుకును కన్నది. బాలింతకు సంటి పిల్లగానికి నువ్వులనూనె తోటి మర్దన చేస్తే మంచిది అంటారు. ఎట్ల చేయాల్నో అర్థం కాలేదు. చేతిలో ఉన్న పైసలన్నీ కాన్పుకే ఖర్చైనై. ఇంక నాతాన పైసలు లేవు. అందుకే పొద్దున్నే అడివికి పోయి వేపపండ్లు ఏరుకుని తీసుకుని వచ్చిన. నూనె దుకాణంలో అమ్మితే ఏమన్న పైసల్‌ వస్తాయి. ఆ పైసలతోని ఇక్కడ్నే నూనె కొనుక్కొని పోదామనుకున్న!”

”మరి ఎందుకు లోపలికి రాలేదు?” అడిగాను.
”ఈరోజు అంగడి కదా! అన్ని దుకాణాల్లో అడుగుకుంట వస్తున్న. ఈ గింజలకు అంతపిరేం నూనె రాదు పోమన్నారు. ఇక్కడికి వచ్చి అడిగినా అదే మాట అంటారు కదా! ఏం చేయాల్నో అర్థం కాక ఇక్కడ్నే కూర్చున్న బిడ్డా!” అన్నది అవ్వ.
నాకు ఆమె మీద జాలి కలిగింది. అలాగే అంతకుముందు ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నామీద నాకే కోపం వచ్చింది.
ఇప్పుడు ఈ ముసలమ్మకు నేనెలా సహాయం చేయగలను అనుకున్నాను. ఆలోచించసాగాను.

అమ్మారు యాడికి పోయినవ్‌? ఆడ ఏం చేస్తున్నవ్‌? ఇలా రా! ఈ నూనెను వడగట్టు అనే పిలుపుతో లోపలికి వెళ్ళబోతూ ముసలమ్మ ముఖం మరోసారి చూసాను.

నువ్వులనూనెను వడగడుతూ యజమాని వైపు చూస్తున్నాను. అతను నన్నే గమనిస్తున్నాడు. నా ప్రాణం కాసేపు వణికింది. నన్ను తప్పుగా ఏమైనా అనుకున్నాడా? ఆలోచించసాగాను.
నూనె పట్టించుకున్న కస్టమర్‌ దుకాణం యజమానికి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయాడు. నేను అతన్నే ఆశగా చూస్తున్నాను. యజమాని నన్నే గమనిస్తూ కనిపించాడు. మళ్ళీ నా పనిలో నేను నిమగమై పోయి ఆ ముసలమ్మకు ఏంచేయగలనో ఆలోచించసాగాను. సాయంకాలం సమయం కావస్తుంది సంధ్యా రవి మెల్లగా ఉదయిస్తున్నాడు. బయట ఎండ పోయిందని ఆరబెట్టిన గింజల్ని సంచుల్లోకి ఎత్తుతున్నాను. ముసలవ్వ దగ్గరికి మా దుకాణం యజమాని వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు.

కాసేపు అవ్వ బతిమాలుతూ ఏదో అడుగుతుంది. కోపంగా ఉన్న మా యజమాని చివరికి సరేనని తలూపి నన్ను పిలిచాడు. దగ్గరికి వెళ్ళిన నాకు అమ్మారు ఈ వేప గింజలు తూకం వేసి ఎంత తూగాయో చెప్పు అన్నాడు. నేను వెళ్ళి తూకం వేసి 51/2 కిలోలు ఉన్నాయని చెప్పాను. ఆ ముసలమ్మను లోపలికి పిలిచి ఆమె తెచ్చుకున్న క్యాన్‌లో కిలో నువ్వులనూనె తూకం వేసి ఇచ్చాడు. ఆ ముసలమ్మ ”అయ్యా…నీ రుణం మరిచిపోను. అడివికి పోయి వేపపండ్లు ఏరుకుని తెస్తా .. మిగతా పైసలకు సరిపడా అయ్యే వరకు నీకే ఇస్తా అన్నది. అప్పుడు ఆ ముసలమ్మ ముఖం చూస్తే నా మనసు నిండిపోయింది.

మా దుకాణం యజమానిపై గౌరవం పెరిగింది.

ముసలమ్మ అటు వెళ్ళగానే మా యజమానిని అడిగాను… ”అయ్యా ఆ ముసలమ్మ మళ్ళీ వస్తుందంటారా! ఎలా నమ్మారు ఆమెను? అంత ధర నూనెను పోసి ఇచ్చారు” అన్నాను. దానికి మా యజమాని ”కొన్ని వ్యాపారాలు వ్యక్తులపై కలిగే నమ్మకంపై జరుగుతాయి. ఒక్కోసారి లాభం రావచ్చు ఒక్కోసారి ఏ లాభమూ రాకపోగా నష్టం రావచ్చు. మనం పనిని చేస్తూ పోవాలి అంతే” అనుకుంటూ వెళ్ళిపోసాగాడు. ఏదో గొప్ప సత్యం తెలుసుకున్నాననిపించింది. నేను మా యజమాని వెళ్ళే వైపు అలాగే చూస్తూ నిలుచుండి పోయి చూస్తున్నాను.

జయంతి వాసరచెట్ల, హైదరాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -