నాలుగేండ్లలో నేలమట్టమైన 170 బ్రిడ్జీలు
ప్రాణాలు కోల్పోయిన 202 మంది..441 మందికి గాయాలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికం
నాణ్యతా ప్రమాణాలపై సవాలక్ష సందేహాలు
పట్టింపులేని పాలకులు
నవతెలంగాణ- హైదరాబాద్
నాలుగేండ్లలో 170 వంతెనలు కూలిపోయాయి. 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 441 మంది తీవ్రంగా గాయపడి, భారంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు. నిర్మాణదశలో ఉన్న వంతెనలు కూడా కూలిపోతున్నాయంటే, నాణ్యతా ప్రమాణాల అమలు ఏపాటిదో అర్థమవుతోంది. పాత బ్రిడ్జీలు శిధిలావస్థకు చేరి కూలిపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. అలాంటి బ్రిడ్జీలపై వాహనాలు, ప్రజల రాకపోకలకు అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే నీళ్లు నమలుతున్నారు. బీహార్‌లోని సహర్సా జిల్లాలో జూన్ నెలలో మధ్యాహ్న సమయంలో మొక్కజొన్నలతో నిండిన ఓ ట్రాక్టర్ మూడు స్పాన్‌ల దఢమైన వంతెనపై నుంచి వెళ్తుండగా క్షణాల్లో బ్రిడ్జి అమాంతం కూలిపోయింది. ఆ కొన్ని వారాలకే, గుజరాత్‌లో 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజ్‌పూర్-గంభీర వంతెన వడోదరలో ఓ వంతెన కూలడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు 2021 నుంచి 2025 మధ్య దాదాపు 170 వంతెనలు కూలిపోయాయి. 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 441 మంది గాయపడ్డారు. అయితే అధికారిక గణాంకాలు మరో విధంగా చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్ )నివేదికలు..2019 నుంచి 2024 మధ్య కేవలం 42 వంతెనలు మాత్రమే కూలిపోయాయని చెబుతున్నాయి. వాస్తవానికి మీడియా నివేదికల విశ్లేషణ.. 2024లోనే 48 వంతెనలు కూలిపోయాయని వెల్లడించాయి. ఇది మంత్రిత్వ శాఖ ఐదేండ్ల లెక్క కంటే ఎక్కువ. ఇక ప్రభుత్వ జాబితా ప్రకారం అనేక వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 30 శాతం కల్వర్టులు, 12 శాతం చిన్న వంతెనలు, 8 శాతం ప్రధాన వంతెనలు, 5 శాతం అదనపు-పొడవైన వంతెనలు ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కంటే పేలవమైన స్థితిలో ఉన్నాయని చెప్తున్నాయి.
నిధులున్నా…ప్రయోజనం సున్నా
2024-25లో(ఎంఓఆర్టీహెచ్)రోడ్లు, వంతెనల కోసం రూ.5,300 కోట్లకు పైగా కేటాయించింది, అందులో 82 శాతం ఖర్చు చేసింది. మరో రూ.33,000 కోట్లు శాశ్వత వంతెన రుసుము నిధి కింద టోల్ వసూలు ద్వారా వచ్చాయి. రాష్ట్రాలు కూడా కేంద్ర రహదారి, మౌలిక సదుపాయాల నిధి ద్వారా రూ.8,493 కోట్లు అందుకున్నాయి. అయినప్పటికీ, ప్రమాదకర స్థితిలో వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. దీంతో పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుజరాత్‌లో..
గుజరాత్‌లో నాలుగేండ్లలో 16 వంతెనలు కూలిన ఘటనలు నమోదయ్యాయి, వీటిలో 2024లోనే ఐదు ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 157 మంది మరణించారు. 178 మంది గాయపడ్డారు. 2022లో మోర్బి వంతెన కూలి 135 మంది మరణించిన విషయం తెలిసిందే. వడోదరలో ఇటీవల వంతెన కూలిపోయిన ఘటన తరువాత, అధికారులు 2,100 వంతెనలను తనిఖీ చేసి, ప్రమాదకరంగా భావించిన ఐదు వంతెనలను మూసివేశారు. 2024-25 సంవత్సరానికి, గుజరాత్ కొత్త వంతెనల కోసం రూ.385 కోట్లు కేటాయించింది. ఈ వంతెన ప్రాజెక్టులలో రూ.1,100 కోట్లకు పైగా ఆమోదించింది. సీఆర్‌ఐఎఫ్ కింద రూ.45.35 కోట్లు అందుకుంది. వంతెనలు కూలిపోవడం తో అత్యవసర ఆడిట్‌లు జరిగాయి. దేశవ్యాప్తంగా నివారణ మౌలిక సదుపాయాల భద్రత కోసం తక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు. వడోదరలో వంతెన కూలిపోయినప్పుడు, కాంక్రీట్ సపోర్ట్ పీఠం కింది భాగంలో నలిగిపో యిందని నివేదికలో పొందుపరిచారు. ‘ఇది స్పష్టంగా నిర్వహణ సమస్య. వంతెన యొక్క అన్ని అంశాలు ఒకే జీవితకాలం కలిగి ఉండవు – ఉదాహరణకు, బేరింగ్‌లు బీమ్‌లు స్తంభాల కంటే చాలా త్వరగా అరిగిపోతాయి. తనిఖీల్లో ఈ వివరాలు తప్పిపోతే, వైఫల్యాలను కప్పిపెట్టడమే’ అని పట్టణ మౌలిక సదుపా యాల నిపుణుడు దేవాన్షు పండిట్ చెప్పారు.
కోర్టులో కేసు వేసిన న్యాయవాది
తరచుగా బీహార్‌లో వంతెనలు కూలిపోతుండడంతో అప్రమత్తమైన న్యాయవాది బ్రిజేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ కేసును పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. ఇది వంతెన పరిస్థితులపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. బ్రిజేష్ సింగ్ పిటిషన్‌లో ఉన్నత స్థాయి నిర్మాణాత్మక ఆడిట్, అసురక్షిత స్పాన్‌ల కోసం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా, బీహార్ 3,968 వంతెనలను అంచనా వేయడం లక్ష్యంగా కొత్తగా ప్రారంభించిన వంతెన నిర్వహణ విధానం 2025 కింద 85 ప్రధాన వంతెనలను తనిఖీ చేయడానికి ఐఐటీ ఢిల్లీ , ఐఐటీ పాట్నాలను సంప్రదించింది. ఇప్పటివరకు, బీహార్‌లో కూలిపోతున్న వంతెనల వల్ల రాష్ట్రానికి కనీసం రూ.3,953 కోట్లు నష్టం వాటిల్లిందని సమాచారం. ఉత్తరాఖండ్‌లో 2021 నుంచి ఇప్పటి వరకు 25 వంతెనలు కూలిపోయినట్టు నివేదించింది. ఒక్క 2021 సంవత్సరంలోనే 21 ఉన్నాయి. జూన్ 2024లో చమోలి జిల్లాలో బెయిలీ వంతెన కూలిపోవడంతో 4,000 మందికి పైగా నివాసితులకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులపై వేటు పడింది. ముఖ్యమంత్రి నుంచి జవాబుదారీతనం హామీ లభించింది. అప్పటి నుంచి రాష్ట్రం రోడ్డు భద్రత కోసం రూ.1,200 కోట్లు కేటాయించింది. సీఆర్‌ఐఎఫ్ కింద రూ.10.07 కోట్లు అందుకుంది. నాలుగేండ్లలో 17 ఘటనలు, 11 మరణాలను చూసిన హిమాచల్ ప్రదేశ్, దశాబ్దాల నాటి వంతెనలను కూల్చివేసి పీఎంజీఎస్ వై-××× కింద పునర్నిర్మించడం ప్రారంభిం చింది. 2024-25కి, సీఆర్‌ఐఎఫ్ కింద రూ.10.15 కోట్లు, కేంద్రం నుంచి రూ.3,667 కోట్ల విలువైన విస్తత మౌలిక సదుపాయాల ప్రణాళికను అందుకుంది.
తనిఖీల్లేవ్…
”డిజైన్ సమస్యలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే, సాంప్రదాయకంగా నది వంతెనలను లేదా నగరాల్లో ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనల్ని పరిగణనలోకి తీసుకుంటే, అవి సాధారణ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడతాయి. ఇక్కడ డిజైన్ తప్పులు చాలా అరుదు. 30-40 ఏండ్ల క్రితం నిర్మించిన నిర్మాణాల్లో వైఫల్యాలు తరచుగా సంభవిస్తాయి వంతెనలు వందేండ్ల పాటు ఉండేలా తయారు చేయబడతాయి. డిజైన్ సరిగా లేకపోతే అది ఏడాదిలోనే కూలిపోతుంది” అని దేవాన్షు తెలిపారు.
సీపీడబ్ల్యూడీ, పీడబ్ల్యూడీ విభాగాలు వర్షాకాలం ముందు, తర్వాత వంతెనలను తనిఖీ చేయాలి. అవి సక్రమంగా జరగట్లేదు. పునాదుల లోపలి భాగాన్ని పరీక్షించడానికి అధునాతన సాధనాలను ఉపయోగించట్లేదు. రెయిలింగ్ నుంచి పునాది వరకు ప్రతి భాగాన్ని అంచనా వేయాలి. మోర్బి వంతెన కూలిన ఘటనలో కేబుల్స్ లోపల తప్పుపట్టడమే కారణం. అవి బయటకు కనిపించవు. వాటిని ఎప్పటికప్పుడు సాంకేతిక పరికరాలతో తనీఖీలు చేయాల్సిందే. ఐఐటీ ఢిల్లీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్), ఇండియన్ స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ సొసైటీ (ఐఎస్ హెచ్‌ఎంఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ సురేష్ భల్లా మాట్లాడుతూ ‘చాలా వంతెనలు ఎలాంటి సెన్సార్లు లేదా రియల్-టైమ్ పర్యవేక్షణ లేకుండా శిధిలావస్థకు చేరాయి. ప్రారంభ దశలో నిర్మాణ క్షీణతను గుర్తించేందుకు రియల్-టైమ్ ఎస్‌హెచ్‌ఎం కోసం ఎల్‌ఓసీ సెన్సార్ల సాంకేతికతను అరుదుగా ఉపయోగిస్తారు. నష్టం సంకేతాలు కనిపించినప్పుడు వంతెన అధికారులు చాలా ఆలస్యంగా మేల్కొంటున్నారు’ అని చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల రెండు వంతెనలు, అర్వాల్-సహార్ వంతెన, అరా-చప్రా వంతెనలపై స్మార్ట్ సెన్సార్లను పరీక్షించమని కోరింది. ఇవి సరైన దిశలో ఒక చిన్న అడుగు మాత్రమేనని భల్లా వివరించారు. మౌలిక సదుపాయాల నిపుణుడు హితేష్ వైద్య మాట్లాడుతూ, వంతెనలు కూలడానికి ఓవర్‌లో డ్‌తో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. చాలా వంతెనలకు పర్యవేక్షణ లేదు. ఉన్నా, పాత పద్ధతులనే ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికం
2021-25 మధ్య కాలంలో బీహార్, ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక వంతెనలు కూలిపోయిన ఘటనలు నమోదయ్యాయి. వీటిలో వరుసగా 26, 25, 17 చొప్పున ఘటనలు జరిగాయి. వాటి తర్వాత గుజరాత్‌లో (16), జమ్మూ కాశ్మీర్‌లో (14), మధ్యప్రదేశ్‌లో (12), ఉత్తరప్రదేశ్‌లో (8), కర్నాటకలో (6), సిక్కింలో నాలుగు వంతెనలు కూలిపోయాయి. జార్ఖండ్, తమిళనాడులో నాలుగు, ఒడిశా, హర్యానాలో మూడు చొప్పున ఘటనలు జరిగాయి. త్రిపుర, అస్సాం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కటి చొప్పున ప్రమాదాలు సంభవించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, రాజస్థాన్, ఢిల్లీలోనూ ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. బీహార్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కేవలం 2024 లోనే ఇక్కడ 15 ఘటనలు జరిగాయి.
పేలవమైన సాంకేతికత
భారతదేశంలో వంతెన తనిఖీ, భద్రతా పద్ధతులు జపాన్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ , చైనా వంటి ప్రపంచ దేశాల కంటే భారత్ గణనీయంగా వెనుకబడి ఉంది. జపాన్‌లో వంతెనలను ప్రతి ఐదేండ్లకు ఒకసారి తనిఖీ చేయాలి. వంతెన ఆపరేషన్ తర్వాత రెండు సంవత్సరాలలోపు ప్రారంభ తనిఖీ ఉంటుంది. జర్మనీ డీఐఎన్ 1076 ప్రమాణాన్ని అనుసరిస్తుంది. కొన్ని వంతెనలు నెలవారీ లేదా వారానికొకసారి తనిఖీలు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్‌లో నేషనల్ బ్రిడ్జ్ తనిఖీ ప్రమాణాల ద్వారా (ఎన్‌బిఐఎస్ ) రెండేండ్లకోసారి తనిఖీలు తప్పనిసరి. కఠినమైన ప్రమాద అంచనాల కింద మాత్రమే పొడిగింపులను అనుమతిస్తుంది. కెనడాలో గరిష్టంగా 540 రోజుల విరామంతో వార్షిక తనిఖీలు చేస్తారు. భారతదేశంలో మాత్రం వంతెన భద్రతను ఆడిట్ చేయడానికి ప్రత్యేక జాతీయ అధికారాలే లేవని నిపుణులు అంటున్నారు.
కూలుతున్న వంతెనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES