Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామూహికంగా వందేమాతరం గీతం ఆలాపన

సామూహికంగా వందేమాతరం గీతం ఆలాపన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఉప్లూర్ చౌరస్తా భరతమాత విగ్రహం వద్ద శుక్రవారం సామూహిక వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందేమాతర గీతం రచించి నేటికీ150 ఏండ్లు గడుస్తున్న నేపథ్యంలో భారత మాత విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు పాల్గొని వందేమాతర గీతాన్ని ఆలపించారు. విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి మాట్లాడుతూ వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈరోజు మన దేశానికి ఎంతో గౌరవదాయకమైన రోజు అన్నారు.

మన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి ఇచ్చిన, మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన “వందే మాతరం” గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. ఈ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రాశారన్నారు. ఆ రోజుల్లో ఈ పాటను పాడటం అంటే బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడటం అని తెలిపారు. మన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరులు ఈ గేయాన్ని గట్టిగా పాడుతూ, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు. అందుకే ఈ రెండు పదాలు  వందే మాతరం మనకెప్పుడూ గర్వకారణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు.మన భారత దేశం మన తల్లి, ఆమె మనకు అన్నీ ఇచ్చిందని, నేల, నీరు, గాలి, సంస్కృతి, గౌరవం అలాంటి తల్లికి వందనము చేసే పుణ్యక్షణం ఇది అన్నారు.వందే మాతరం అంటే “ఓ తల్లీ, మాతృభూమీ! నీకు నమస్కారం” అని చెప్పడం అని తెలియజేశారు. మండలంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో వందేమాతరం గీతం ఆలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -