నవతెలంగాణ – మునుగోడు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం పనులు తక్షణమే మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.భూ భారతి దరఖాస్తులు, భూములకు సంబంధించిన సమస్యలు, దరఖాస్తుల పరిష్కారం, తదితర వివరాలను తహసిల్దార్ నరేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,ప్రజావాణి ఫిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించి, పాఠశాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కానందున అక్కడినుండే ఈ డబ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే పాఠశాల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. స్థలానికి సంబంధించిన అడ్వాన్స్ పొజిషన్ వివరాలను జిల్లా కలెక్టర్ చండూర్ ఆర్డీవో శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలకు వెళ్లే రహదారి , పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి ఉన్నారు.