– ఎంపీడీఓ, తహసీల్ కార్యాలయాల సందర్శన
– భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష
– భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి… కలెక్టర్
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల, ఎరువుల గోడౌన్ తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్ లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా? లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలుపగా, కలెక్టర్ అప్పటికప్పుడు తన సమక్షంలోనే ఫేస్ రికగ్నేషన్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్ లైన్ లో నమోదు చేయించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం సంపూర్ణంగా అమలు అయ్యేలా చూడాలని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
తరగతి గదుల సందర్శన….
వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్న తీరును గమనించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంట గది, మద్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, ఉడకబెట్టిన కోడి గుడ్డును అందించాలని ఆదేశించారు. విద్యార్థులు అందరూ తరగతులకు ప్రతిరోజూ హాజరయ్యేలా చూడాలని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ….
వేల్పూర్ లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణకు సూచించారు. జాతీయ నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ, వ్యాక్సినేషన్, గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లింగ నిర్ధారణ, భ్రుణ హత్యలు వంటివి చోటుచేసుకోకుండా గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలన్నారు.అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బేబీ వార్మర్లు పని చేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్, టీ.జీ.ఎం.ఎస్.ఐ.డీ.సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి, వెంటనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బేబీ వార్మర్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్తవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎరువుల గోదాముల తనిఖీలు….
వేల్పూర్ మండల కేంద్రంలోని సింగల్ విండో ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని, పూర్తి స్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పధ్ధతి, క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
వేల్పూర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో బాలకిషన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు స్వికరిస్తున్నారా? అని ఆరా తీసిన కలెక్టర్, ఆన్ లైన్ వివరాలను పరిశీలించారు. ప్రజా పాలన సేవా కేంద్రం కొనసాగుతున్నట్లు ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతి కార్యదర్శి వినోద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులు అందరూ ఇళ్ళను నిర్మించుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
వేల్పూర్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES