నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం బాన్సువాడ గ్రామానికి చెందిన విద్యార్థి శశిధర్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్న శశిధర్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ చాటుకున్నాడన్నారు. ఇప్పటివరకు శశిధర్ 15 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలలో, 7 సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు.
ఇటీవల 14.02.2026 నుండి 19.02.2026 వరకు ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్‌లో ఇండియా జట్టు తరుపున పాల్గొని బంగారు పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశిధర్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చినందుకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు లోయపల్లి చిన్న నర్సింగ్ రావు, కార్యదర్శి కృష్ణమూర్తి, నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ కోశాధికారి రాజేశ్వర్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, శశిధర్ తండ్రి శివ రాజులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



