ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైతు వేదిక నందు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న ఎన్నికల సామాగ్రిని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని మండలంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసే విధానాన్ని ఆయన మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో రురావత్ రమాదేవిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల్లో చేసే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సదుపాయాలు తదితర అంశాలను ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి పోలింగ్ బూత్‌లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ బూత్‌లో నీటి సదుపాయం, ర్యాంపులు, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలను అధికారుల ముందుగానే పరిశీలించాలన్నారు. అనంతరం శాంతి భద్రతల విషయంలో కూడా పోలీస్ అధికారులతో చర్చించారు.
సమస్యాత్మక గ్రామాలలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఎటువంటి పొరపాట్లు చేయవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ఆయన వెంట మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రురావత్ రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, ఎస్సై పొదిలి వెంకన్న, ఆయా పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, రూట్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



