– నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, మాల్‌ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలకు తీసుకురాకుండా చూడాలని, సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, తహసీల్దార్ హిమబిందు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.



