నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ – 2025 టోర్నమెంట్ల 2వ ఎడిషన్ గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చీఫ్ మినిస్టర్స్ కప్ వంటి పోటీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కబడ్డీ ఆడుతూ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడా అధికారులు వెంకటేశ్వర్లు గౌడ్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్ధన్, పీడీ మెప్మా, కోచ్‌లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



