Monday, August 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసైకిల్‌పై ప్రభుత్వాస్పత్రికి కలెక్టర్‌

సైకిల్‌పై ప్రభుత్వాస్పత్రికి కలెక్టర్‌

- Advertisement -

ఆకస్మిక తనిఖీల్లో భాగంగా
సతీమణితో కలిసి 22 కి.మీ ప్రయాణం
త్వరలో రామయంపేటకు గైనకాలజిస్టును నియమిస్తాం
765 డీజీ హైవేపై రోడ్డు భద్రత చర్యలకు ఆదేశిస్తాం : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
నవతెలంగాణ-రామాయంపేట

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలతో అధికారులను అలర్ట్‌ చేస్తూ, ఆకట్టుకుంటున్న జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆదివారం తన సతీమణితో కలిసి సైకిల్‌పై జిల్లా కేంద్రం నుంచి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించి రామాయంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్‌ హౌదాలో ఆయన సైకిల్‌పై ఆస్పత్రిని సందర్శించడం పలువురిని ఆకట్టుకుంది. గతంలోనూ తన సతీమణితో కలిసి ఆయన రామాయంపేట బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ అనూహ్య పర్యటనలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా రోగుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం, ఆస్పత్రి సిబ్బంది పనితీరు, పరిశుభ్రత వంటి అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసు కున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు పట్టిక, రోజు ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాల రికార్డులు పరిశీలించారు. అంటువ్యాధుల నియంత్రణపై సూచనలు చేశారు. ఆస్పత్రిలో త్వరలో గైనకాలజిస్ట్‌ను నియమించి, ప్రసవాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్‌ హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సెలవు రోజుల్లో కూడా సిబ్బంది సమయపాలన పాటించేలా చూస్తున్నామని చెప్పారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదని, డెంగ్యూ కేసులు అక్కడక్కడ ఉన్నా, ప్రమాదకర స్థాయిలో లేవన్నారు. వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.

765 డీజీ హైవేపై రోడ్డు భద్రత చర్యలకు ఆదేశిస్తాం
రోడ్డు భద్రతకు సంబంధించి కూడా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి, అక్కడ ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 765 డీజీ జాతీయ రహదారిపై కూడా కొన్ని చోట్ల సూచిక బోర్డులు ఉన్నా, ఇంకా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు గుర్తించామని అన్నారు. వాటన్నింటిని త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -