Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిఫ్ట్‌ డీడ్‌ రద్దుపై కలెక్టర్‌ రెండో అప్పీల్‌ విచారణ చెల్లదు

గిఫ్ట్‌ డీడ్‌ రద్దుపై కలెక్టర్‌ రెండో అప్పీల్‌ విచారణ చెల్లదు

- Advertisement -

హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ చట్టం కింద గిఫ్ట్‌ డీడ్‌ రద్దు వ్యవహారంలో కలెక్టర్‌ ఆదేశాలపై కమిషనర్‌ వద్ద రెండో అప్పీల్‌ విచారణకు చట్టంలో అవకాశం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కమిషనర్‌ ఆదేశాల తర్వాత కలెక్టర్‌ రెండోసారి అప్పీల్‌ పిటిషన్‌ను విచారణ చేసి ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన పరిధిని మించి కమిషనర్‌ జోక్యం చేసుకున్నారని ఆక్షేపించింది. కమిషనర్‌ ఆదేశాల ఆధారంగా కలెక్టర్‌ జారీ చేసిన గిఫ్ట్‌ డీడ్‌ రద్దు ఉత్తర్వులను రద్దు చేసింది. కలెక్టర్‌ రెండో అప్పీల్‌ను సమర్ధిస్తూ హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంలో రెండోసారి అప్పీల్‌ పిటిషన్‌ను కలెక్టర్‌ విచారణ చేయడాన్ని మాత్రమే రద్దు చేస్తున్నామనీ, గిఫ్ట్‌ డీడ్‌లోని అంశాల జోలికి వెళ్లడం లేదని తెలిపింది. గిఫ్ట్‌డీడ్‌లోని ఆస్తుల వ్యవహారంపై సివిల్‌ కోర్టులో తేల్చకోవాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే…మెడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్‌ మండలం కోత్తపేటలోని 247 చదరపు గజాల నివాస స్థలంలోని ఇంటిని సీ.రాములు తన మనువడైన సీ.శ్రీనివాస్‌కు 2018లో గిఫ్ట్‌ డీడ్‌ చేశారు. ఆ స్థలంలో శ్రీనివాస్‌ ఇంటిని నిర్మించాడు. అయితే, శ్రీనివాస్‌ తన సంరక్షణ, పోషణ చర్యలు తీసుకోవడం లేదంటూ రాములు గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ చట్టం-2007 సెక్షన్‌ 23 కింద కీసర రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ను ఆశ్రయించారు. గిఫ్ట్‌ డీడ్‌లో షరతులు లేనందున, ఇది సివిల్‌ వివాదమని చెప్పి ఆర్డీవో కొట్టేశారు. దీనిపై రాములు మెడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ వద్ద అప్పీల్‌ దాఖలు చేస్తే.. ఆర్డీవో ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. అప్పీల్‌ను 2023 జూలై 6న కలెక్టర్‌ కొట్టేశారు. దీంతో రాములు కమిషనర్‌/డైరెక్టర్‌ (సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల సంక్షేమ శాఖ) వద్ద రెండో అప్పీల్‌ దరఖాస్తు చేశారు. 2025 మార్చి 18న అప్పీల్‌ను స్వీకరించిన కమిషనర్‌ మళ్లీ కలెక్టర్‌ సమీక్షించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. దీని ఆధారంగా కలెక్టర్‌ కేసును తిరిగి విచారించి 2025 ఏప్రిల్‌ 22న గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యలను సవాలు చేస్తూ శ్రీనివాస్‌ మూడు వేర్వేరు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సింగిల్‌ జడ్జి అన్ని పిటిషన్లను కొట్టివేయడంతో ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ పూర్తి చేసి.. సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ చట్టం-2007లోని న్యాయపరమైన వ్యవస్థను వివరించింది. చట్టం ప్రకారం తొలుత ఆర్డీవో విచారణ చేయాలనీ, ఆర్డీవో నిర్ణయంపై జిల్లా కలెక్టర్‌ వద్ద అప్పీల్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. కలెక్టర్‌ ఇచ్చిన అప్పీల్‌ తీర్పే తుది నిర్ణయమని చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపింది. కమిషనర్‌ జోక్యం చేసుకుని కలెక్టర్‌ రెండోసారి విచారణ చేయాలని ఆదేశించడం చెల్లదని డివిజన్‌ బెంచ్‌ తేల్చింది. కలెక్టర్‌ గిఫ్ట్‌డీడ్‌ రద్దు చేయడం చెల్లదని పేర్కొంది. కలెక్టర్‌ నిర్ణయాన్ని సింగిల్‌ జడ్జి సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు కూడా చెల్లదని తేల్చింది. కలెక్టర్‌ తీర్పుపై కమిషనర్‌ వద్ద రెండో అప్పీల్‌ లేదా రివ్యూ విచారణకు చట్టంలో ఎలాంటి నిబంధన లేదని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. చట్టంలో లేని అధికారాన్ని కమిషనర్‌ వినియోగించుకోవడం చెల్లదని చెప్పింది. కమిషనర్‌ ఉత్తర్వులు చెల్లవు కాబట్టి వాటి ఆధారంగా కలెక్టర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ రద్దు ఆదేశాలు కూడా చెల్లవంది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు కూడా చెల్లుబాటు కాదంది. గిఫ్ట్‌ డీడ్‌ చెల్లుబాటు లేదా రద్దు అంశంలోకి తాము వెళ్లడం లేదని, గిఫ్ట్‌డీడ్‌లోని ఆస్తి విషయంపై సివిల్‌ కోర్టులో రాములు తేల్చుకోవచ్చునని స్పష్టం చేసింది.

బాల్కసుమన్‌పై కేసుల వివరాలివ్వండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చెన్నూరు, శేరిలింగంపల్లి పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు అందజేయాలని పోలీసులను హైకోర్ట్‌ ఆదేశించింది. మున్సిపల్‌ ఎన్నికల్ణ సమయంలో కోడ్‌ ఉల్లంఘించి ధర్నా చేశారని చెన్నూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం వద్ద ప్రభుత్వానికి ఎక్సైజ్‌ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారని శేరిలింగపల్లి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. వీటిని కొట్టేయాలని సుమన్‌ వేసిన రెండు పిటిషన్లను జస్టిస్‌ కె.సుజన విచారించి పోలీసులకు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.

పరిహారంపై ప్రభుత్వానికి నోటీసులు
శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిమిత్తం సేకరించిన భూమికి పరిహార జీవో వెలువడినప్పటికీ తమకు చెల్లించలేదంటూ నందయ్య ఇతర రైతులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కింద ప్రభుత్వం రూ.58 కోట్లు విడుదల చేసినప్పటికీ పరిహారం ఎందుకు చెల్లించలేదో తెలియజేయాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీ, శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌, జగిత్యాల జిల్లా కలెక్టర్‌లకు నోటీసులిచ్చింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -