Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల మెరుగుదలపై కలెక్టర్ దృష్టి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా లేదా అన్నది అటెండెన్స్ రిజిస్టర్ ద్వారా పరిశీలించారు. ఆసుపత్రికి రోజువారీగా ఎంతమంది పేషెంట్లు వస్తున్నారో, వారు ఏ రకమైన వ్యాధులతో వస్తున్నారో కూడా తెలుసుకున్నారు. అవసరమైన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అనే అంశంపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సందర్శన సందర్భంగా రోగులతో మమేకమయ్యారు. వారిని వ్యక్తిగతంగా పలకరించి, ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

రోగులకు సరైన వసతులు, పరిశుభ్రత, వైద్యులు మరియు సిబ్బంది సహకారం తగిన విధంగా అందుతున్నాయా లేదా అని విచారించారు.రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, వాటిని వివరంగా విన్నారు. ఆసుపత్రిలో చికిత్స, మందులు, పరీక్షలు వంటి సదుపాయాలు సమృద్ధిగా అందుతున్నాయా అన్నది ప్రత్యక్షంగా రోగుల నుండి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని, ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు.

సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు కు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట స్థానిక సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -